అందరికీ నచ్చేలాగా రుషికొండకు మోక్షం!

జగన్మోహన్ రెడ్డి.. ప్రజలు తనకు ఒక్కచాన్స్ ఇచ్చినందుకే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తనను తాను శాశ్వతంగా పరిపాలించే చక్రవర్తిగా ఊహించుకున్నారు. ఏ ఊరిలో అడుగు పెడితే అక్కడ.. అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ లు నిర్మించుకుని ఆనందిస్తూ ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఒక అడుగు ముందుకు వేసి, తన చక్రవర్తిత్వానికి శోభ తెచ్చేలాగా.. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన విశాఖపట్టణంలో సర్కారు సొమ్ముతోనే తన నివాసభవంతులు కట్టించుకోవాలనుకున్నారు.

చక్రవర్తికి మాత్రమే భవంతులు తయారైతే ఎలా.. ఆయన ఇద్దరు కూతుళ్లకు కూడా చెరొక భవంతి అన్నట్టుగా మొత్తం మూడు భవంతుల నిర్మాణాన్ని టూరిజం డబ్బులతో చేయించారు. అందుకోసం పర్యావరణ ప్రాధాన్యం ఉన్న రుషికొండను బోడికొట్టించి సర్వనాశనం చేశారు. సకల అరాచకత్వానికి పాల్పడ్డారు. కోర్టులో కేసులు నడిస్తే అక్కడ అబద్ధాలతో బుకాయించారు. అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల కోసం అతిథిభవనాలు అని చెప్పారు. తీరా ఓపెనింగ్ చేశారే తప్ప.. ఆ భవంతుల్లో ఒక్కరోజైనా సేదతీరే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజా తీర్పు జగన్ ను పదవీచ్యుతుడిని చేసింది. ఆయన అరాచక, నియంతృత్వ పోకడలకు ప్రతీకగా భవంతులు మిగిలాయి.
ఆయన తన నివాసం కోసం చేసుకున్న ఆ భవంతుల్ని  ప్రభుత్వానికి ఉపయోగపడేలా ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం నాటినుంచి ఇప్పటిదాకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయాయి. వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరుల్ని కోరుతున్నారు. మంత్రులందరూ రుషికొండ భవంతుల్ని పరిశీలించి, ఒక నిర్ణయానికి రావాలని, తమకు తోచిన సలహాలు చెబితే.. ఆ భవనాల్ని ఏం చేయాలో ఆలోచిద్దాం అని చంద్రబాబు సూచించారు.

రుషికొండ విలాసభవనాలను వినియోగించుకోవడంలో ఏకపక్ష నిర్ణయాలకు వెళ్లకుండా అందరికీ నచ్చే విధంగానే ప్రభుత్వానికి లాభం ఉండేలా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ సర్కారు వాటి నిర్మాణం కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పుడున్న రూపంలో అవి ఎందుకూ ఉపయోగపడవని చంద్రబాబు భావిస్తున్నారు. వాటిని వినియోగంలోకి తీసుకురావాలంటే చాలా వరకు మార్పు చేర్పులు తప్పవని పలువురు అనుకుంటున్నారు. చంద్రబాబు ఈ విషయంలో చాలా పారదర్శకంగా ఉండడం గమనార్హం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ప్రెస్ మీట్లో విలేకరులు ప్రస్తావించినప్పుడు కూడా.. ‘మీకు కూడా రాష్ట్రం గురించి బాధ్యత ఉంది.. మీరైనా సలహాలు ఇవ్వండి.. రాష్ట్రానికి ఉపయోగపడేలా వాటిని వాడుకునే ఆలోచన వస్తే చెప్పండి’ అని చంద్రబాబు అడిగారు. మొత్తానికి అందరికీ నచ్చే విధంగానే రుషికొండ భవనాలపై నిర్ణయం ఉంటుందని అంతా భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories