గుండెమార్పిడి కోసం పెద్దగుండె చాటుకున్న లోకేష్!

బ్రెయిన్ డెడ్ అయిన మహిళ శరీర భాగాలను అవయవదానం చేయడానికి ఆమె కుటుంబం ఒప్పుకోవడమే ఒక అద్భుతం. వారి మానవత్వపు దృక్పథానికి చేతులెత్తి నమస్కరించాలి. గుంటూరులో  ఓ కుటుంబం అలాంటి నిర్ణయం తీసుకోగా.. మరణించిన మహిళ గుండెను తిరుపతిలో చికిత్స పొందుతున్న ఒక నిరుపేద మహిళకు అమర్చడానికి వీలుగా.. దానికోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానంమ ఏర్పాటుచేసి దాని ద్వారా పంపండం ద్వారా.. మంత్రి నారా లోకేష్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఒక కుటుంబం తాము కోల్పోయిన వ్యక్తి అవయవాల్ని దానం చేయదలచుకుంటే.. అందుకు మంత్రిగా, మానవత్వం ఉన్న మనిషిగానూ నారా లోకేష్ అందించిన సహకారం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరులో చెరుకూరి సుష్మ (47) అనే మహిళ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఆస్టర్ రమేష్ ఆస్పత్రిలో చేరింది. ఆమె భర్త  శ్రీనివాసరావు ఒక ఇన్సూరెన్సు ఏజంటు. ఆమె చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్టుగా నిర్ధరించడంతో ఆస్పత్రి వారు కుటుంబానికి అవయవదానం గురించి సూచించారు. సుష్మ శరీర భాగాలు ఇతరుల ప్రాణాలు నిలబెట్టడానికి ఉపయోగపడతాయని తెలిసి వారు కూడా అంగీకరించారు.

ఈ మేరకు గుంటూరు రమేష్ ఆస్టర్ ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసింది. ఆమె గుండెను తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి తరలించడానికి ప్రత్యేకవిమానాన్ని లోకేష్ ఏర్పాటుచేశారు. అలాగే ఊపిరితిత్తులను చెన్నై పంపడం కోసం మరో ప్రత్యేక అంబులెన్సు ద్వారా గన్నవరం విమానాశ్రయానికి పంపారు.  ఒక కిడ్నీ, కాలేయాన్ని ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి ఇవ్వగా, మరో కిడ్నీని విజయవాడలోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి వైద్యులు తీసుకువెళ్లారు.

తిరుపతిలో గుండె అవసరంతో చికిత్స పొందుతున్న రోగిది నిరుపేద కుటుంబం. సుష్మ శరీరం నుంచి గుండె సేకరించే సమయానికి తిరుపతి విమానం లేదని తెలియడంతో లోకేష్ ప్రత్యేక విమానం సొంత ఖర్చుతో ఏర్పాటుచేశారు.
కాగా.. అవయవదానంతో పలువురి ప్రాణాలను నిలబెట్టడానికి తోడ్పాటు అందించిన సుష్మ కుటుంబ సభ్యులకు వేనోళ్ల అభినందనలు అందుతున్నాయి. అవయవదానం పట్ల సమాజంలో స్పృహ పెరగాల్సిన అవసరం ఇంకా చాలా ఉన్నదని.. వివిధ రకాల మూర్ఖ నమ్మకాలను పక్కన పెట్టి ప్రజలు సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories