వరుసగా ప్యాలెస్ లలో గడుపుతూ.. ఖాళీ దొరికినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో ఆలకించి.. వాటి మీద ట్వీటు ద్వారా తనకు తోచినదెల్లా మాట్లాడుతూ ఉండే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏదో సామెత చెప్పినట్టుగా.. ఈసారి ఒక కీలక విషయంలో చాలా ఆలస్యంగా స్పందిస్తున్నారు. ఎంత ఆలస్యంగా అంటే.. అసలు ఆయన ప్రస్తావించిన సమస్య, అనగా ప్రభుత్వ పొరబాటు గురించి ప్రజలు కూడా మర్చిపోయారు. తెలిసో తెలియకో జరిగిన తప్పును దిద్దుకోవడానికి ప్రభుత్వం చాలా సానుకూల వైఖరితో ముందుకు వచ్చింది. అంతా సమసిపోయిన తర్వాత.. ఇప్పుడు దానిని ప్రస్తావించి.. ఏదేదో నిందలు వేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆలస్యంగా స్పందించిన తీరు చూస్తే.. అసలు తప్పు జరిగినప్పుడు తమరు ఎక్కడున్నారు సామీ.. నోరు మెదపలేదేమిటి సామీ అని ప్రజలు అనుకుంటున్నారు.
ఇంతకూ విషయం ఏంటంటే.. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని నల్లమల అడవుల్లో కాశినాయన జ్యోతి క్షేత్రం, ఆశ్రమం ఉంటాయి. కాశినాయన పట్ల కడపజిల్లాలో మాత్రమే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మందికి అపరిమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడి ఆశ్రమంలో ఉన్న కొన్ని షెడ్లను కొన్ని రోజుల కిందట అటవీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టనివారణ చర్యలు తీసుకుంది. మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ఆశ్రమం ఇన్చార్జి స్వామికి స్వయంగా ఫోను చేసి క్షమాపణలు చెప్పారు. అధికారులు కూల్చివేసిన సమస్త షెడ్లను స్వయంగా తన సొంత ఖర్చుతో పునర్నిర్మింపజేస్తానని కూడా లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్పందన, లోకేష్ స్పందన పట్ల ప్రజలు కూడా హేపీ ఫీలయ్యారు.
అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఎపిసోడ్ మొత్తం ముగిసిపోయిన తర్వాత.. ఇప్పుడు తీరిగ్గా స్పందిస్తున్నారు. బెంగుళూరు ప్యాలెస్ నుంచి కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్ కు ఒక వినతిపత్రం అందిందిట. కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు జరిగాయి గనుక.. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే హిందూధర్మానికి అపచారం జరుగుతున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. లడ్డూ కల్తీ వివాదం రచ్చకెక్కడాన్ని కూడా కూటమి ప్రభుత్వం నేరం కింద ఆపాదించడం అనేది ఆయన బరితెగింపునకు పరాకాష్ట అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
కాశినాయన క్షేత్రం గురించి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇన్ని నిందలు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. తన పాలన కాలాంలో ఆ క్షేత్రం కోసం కనీసం ఒక బస్సు వేయించలేకపోయారు. అక్కడకు ఆర్టీసీ బస్సు కావాలని వారు పదేపదే వినతులు ఇచ్చుకున్నప్పటికీ.. జగన్ వాటిని కనీసం పట్టించుకోలేదు. తన సొంత జిల్లాలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రానికి కనీసం బస్సు వేయించలేని అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయన ముద్ర పడ్డారు. అప్పుడు వచ్చిన వినతిపత్రాలన్నీ ఏ బుట్టకు దాఖలు చేశారో గానీ.. ఇప్పుడు సమస్య ముగిసిపోయిన తర్వాత వినతిపత్రం వచ్చిందంటూ.. కూటమి సర్కారు హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నదంటూ.. ట్వీట్లు చేయడం చిత్రంగా ఉంది.