వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగిన కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రభావితం చేయగలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గుర్తింపు ఉంది. మీడియా ఫోకస్ లోకి పెద్దగా రాకుండా.. పార్టీలో మొత్తంగా చక్రం తిప్పుతూ ఉండేవారని పార్టీ వర్గాలే అంటుంటాయి. జగన్ సర్కారు ప్రధాన దోపిడీ మార్గాలుగా ఎంచుకున్న ఇసుక అక్రమవ్యాపారం దందాకు గానీ, లిక్కర్ దందాలకు గానీ పెద్దరెడ్డి తండ్రీకొడుకులు రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలే సారథులు అని కూడా సర్వత్రా ఆరోపణలు వినిపిస్తుంటాయి.
అంతటి కీలకమైన నాయకుడు ఇప్పుడు అరెస్టు భయంతో వణికిపోతున్నట్టుగా కనిపిస్తోంది. కేసులో నిందితుడిగా తన పేరు లేకపోయినప్పటికీ కూడా.. తాను కనిపిస్తే చాలు పోలీసులు అరెస్టు చేసేస్తారని ఆయన తెగ ఆందోళన పడుతుండడం గమనార్హం. ముందస్తు బెయిలు పిటిషను వేసుకున్న మిథున్ రెడ్డి.. చివరికి.. తన తండ్రి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని ఆయన హైకోర్టు ద్వారా.. ఏప్రిల్ 3వ తేదీదాకా అరెస్టు కాకుండా రక్షణ పొందడం గమనార్హం.
జగన్ సర్కారు నడిపించిన లిక్కరు స్కామ్ దేశంలోనే ఈ ముసుగులో సాగిన అతిపెద్ద దోపిడీపర్వం అని ప్రాథమిక విచారణలు నిగ్గు తేల్చాయి. ఇప్పటికే అరెస్టు అయిన కొందరు నిందితులు వెల్లడించిన సంగతులు మిథున్ రెడ్డి పాత్రను కూడా స్పష్టం చేస్తున్నాయి. అంతమాత్రాన పోలీసులు ఇంకా మిథున్ రెడ్డి పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు. దాంతో అరెస్టు భయంతో వణికిపోతున్న మిథున్.. ముందస్తుగా తనకు బెయిలు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. నిందితుల జాబితాలో ఆయన లేడు.. ఆయనకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. అప్పుడే బెయిలు అడగడం చట్టవిరుద్ధం అంటూ పోలీసుల తరఫు న్యాయవాదులు అంటున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఈలోగా మిథున్ రెడ్డికి కాలం కలిసి వచ్చింది. ఆయన తండ్రి మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో జారిపడి చేయి కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. తిరుపతిలోని ఒక ప్రెవేటు ఆస్పత్రిలో చేరిన పెద్దిరెడ్డికి శస్త్రచికిత్స చేశారు.
అయితే మిథున్ రెడ్డి అరెస్టు గురించి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవాలంటే.. ఒక ఉదాహరణ ఏంటంటే.. కోర్టులో బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా.. తండ్రిని పరామర్శించడానికి మిథున్ రెడ్డి వచ్చినా సరే.. పోలీసులు అక్కడికక్కడ అరెస్టు చేస్తారనే అనుమానాన్ని ఆయన న్యాయవాదులు కోర్టు ఎదుట చెప్పున్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు వినడం పూర్తిచేసిన న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో అప్పటిదాకా మిథున్ ను అరెస్టు చేయవద్దని కూడా ఆదేశించింది. మిథున్ కు ఇది ఊరటేగానీ.. అది తాత్కాలికమే. పైగా ఈ మాత్రం ఊరట కోసం ఆయన తండ్రి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు.