పార్టీకి ఓ పద్ధతుంటుందని కొలికపూడికి తెలుసా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద కూడా రకరకాల ఆరోపణలు వినవస్తూనే ఉన్నాయి. ఇసుక వ్యాపారంలో గానీ, లిక్కరు వ్యాపారంలో గానీ.. ఎమ్మెల్యేలు చిన్న చిన్న దందాలకు పాల్పడుతున్నట్టుగా అక్కడక్కడా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండడం గురించి పార్టీ ఎమ్మెల్యేలందరినీ తొలినుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎవరిమీదనైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో.. వారిని పిలిచి మందలించి దారిలో పెడుతున్నారు కూడా..! కానీ కాస్త లోతుగా గమనిస్తే తెలుగుదేశం పార్టీని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మిగిలిన అందరు ఎమ్మెల్యేలకంటె ఎక్కువగా బజార్న పడేస్తున్నట్టుగా.. పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ అన్నాక దానికి ఒక పద్ధతి ఉంటుందనే సంగతి కూడా తెలియకుండా.. కొలికపూడి రోడ్డెక్కి ఏది పడితే అది మాట్లాడేస్తుంటే ఎలా అని పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు.

ప్రస్తుత పరిణామాలకు వస్తే.. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరగాలని గిరిజన మహిళలు ఆందోళనకు దిగారు. ఇది తెలుగుదేశం నేత రమేశ్ రెడ్డి మీద ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం కావడం విశేషం. దీంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసర రావు రంగంలోకి దిగారు. రమేశ్ రెడ్డి వ్యవహారాన్ని పది రోజుల కిందటే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లానని, 48 గంటల్లోగా ఆయన మీద పార్టీ చర్యలు తీసుకోకపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. బాధిత మహిళకు న్యాయం చేయకపోతే ఇక ఎమ్మెల్యేగా తానెందుకంటూ ఆయన రెచ్చిపోయి ప్రశ్నిస్తున్నారు.

మహిళలకు అండగా నిలబడుతున్నాను గనుక.. తన వాదనలో న్యాయం ఉన్నదని కొలికపూడి అనుకోవచ్చు. కానీ.. పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకునేదాకా క్షేత్రస్థాయి వాస్తవాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లడం.. చర్యలు తీసుకోకపోతే పార్టీకి జరగగల నష్టాన్ని వారికి వివరించడం ఆయన బాధ్యత. అలాంటి పనేమీ చేయకుండా.. పార్టీకే అల్టిమేటం ఇవ్వడం దూకుడు అని పలువురు అంటున్నారు. పైగా పదిరోజుల కిందటే పార్టీకి చెప్పినా పట్టించుకోలేదని అనడం చూస్తోంటే.. పార్టీని ఇరుకున పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టగా కూడా పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆయన తీరు పార్టీకి కొత్త తలనొప్పిగా మారుతున్నదని అంటున్నారు.


కేవలం ఇదొక్క వ్యవహారం మాత్రమే కాదు. తానుఎమ్మెల్యే కాగానే నియోజకవర్గానికి చక్రవర్తిని అనుకున్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైసీపీ నాయకుడి ఇంటి నిర్మాణం జరుగుతోంటే.. ఎలాంటి లీగల్ చర్యలు లేకుండా.. జేసీబీని స్వయంగా తీసుకువెళ్లి దానిని కూలగొట్టించే ప్రయత్నం చేయడం, ఇతరత్రా పార్టీ నాయకులతో వ్యవహరించిన వైనం పార్టీని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు మరొక పార్టీ నాయకుడి మీద ఆరోపణలతో ఆయన ఇంకా రెచ్చిపోతుండడం గమనార్హం. 

Related Posts

Comments

spot_img

Recent Stories