చేసినవి తప్పుడు పనులు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అయినవారికి దోచిపెట్టడంలో ఆరితేరిపోయారు.. తలా తోకా లేకుండా విచ్చలవిడి నియామకాలు చేపట్టారు.. జగన్ కళ్ళలో ఆనందం చూడడం కోసం ఆయన కరపత్రికలకు అగ్ర పూజ చేశారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాపాలన్నీ బయటకు వచ్చాయి! విచారించాలి ఓసారి రమ్మని అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు పంపితే.. ‘ఖాళీ లేదు. ఖాళీ ఉన్నప్పుడు చూద్దాం’ అన్నట్టుగా పెడసరపు సమాధానాలు చెబుతున్నారు.. విస్మయం కలిగించే ఈ ప్రవర్తనాసరళి తుమ్మా విజయకుమార్ రెడ్డి అనే ఐఐఎస్ అధికారి ది! జగన్ ప్రభుత్వం హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా, ఎక్స్ అఫీషియల్ కార్యదర్శిగా చేశారు ఆయన. అధికార దుర్వినియోగంలో తారస్థాయికి వెళ్లారని అభియోగాలు ఉన్నాయి. ఏ సంగతీ ఏసీబీ విచారణలో తేలవలసి ఉంది. అయితే నోటీసులకు ఆయన స్పందించి సహకరిస్తేనే కదా ఏ సంగతి తేలేది. నోటీసులు అందిన తర్వాత ఖాళీ లేదు అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఫలానా తేదీన రావాలని నిర్దిష్టంగా సూచిస్తూ మరొకసారి నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి జమానాలో సమాచార శాఖలో కమిషనర్ గా కీలక పదవిలో ఉన్న విజయ్ కుమార్ రెడ్డి సాక్షి పత్రిక టీవీ ఛానళ్లకు దొడ్డి దారిన దోచి పెట్టారని.. సాక్షి మీడియా గ్రూపులోని సిబ్బందిని అడ్డదారులలో ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించారని.. అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ ఆయన మీద గత నవంబర్ లోనే కేసు నమోదు చేసింది. సాక్ష్యాధారాల సేకరణలో జగన్ పాలన ఐదేళ్ల కాలంలో కేవలం ఒక్క సాక్షి పత్రికకే 371 కోట్ల రూపాయలకు పైగా ప్రకటనల రూపంలో నిధులు దోచిపెట్టినట్లు గుర్తించారు. ఆ కాల వ్యవధిలో మొత్తం పత్రికలకు ఇచ్చిన ప్రకటనలలో ఒక సాక్షికి మాత్రమే కేటాయించినది 43శాతం కావడం గమనార్హం. టీవీ ఛానల్ ల విషయంలో అన్ని ఛానళ్లకు కలిపి 26.7ల కోట్ల ప్రకటనలు ఇవ్వగా సాక్షి మరియు వైసీపీ అనుకూల ఛానల్ రెండింటికి కలిపి 16.17 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా గమనించాల్సిన సంగతి.
ఈ స్థాయి దుర్వినియోగం దోపిడీ జరిగిన తర్వాత ఏసీబీ విచారించకుండా ఎలా ఉంటుంది. అయితే ఆ విచారణకు మాత్రం ఆయన సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారు విజయ్ కుమార్ రెడ్డి. ఆ సంగతి తేలేదాకా విచారణకు హాజరయ్యే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లుగా లేదు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేవు గాని.. నోటీసులకు స్పందించకపోతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. మరొక నోటీస్ ఇచ్చి నిరీక్షిస్తూ కూర్చుంటారా లేదా అరెస్టు చేసి అయినా సరే విచారిస్తారా అనేది గమనించాలి.