అల్లుడే వివేకా హంతకుడని చాటే కుట్ర.. ‘హత్య’!

పెద్దగా రాద్ధాంతమూ చడీ చప్పుడూ లేకుండా ‘హత్య’ అనే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎస్. ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. శ్రీవిద్య బసవ దర్శకులు. ఈ చిత్రం ఓపెనింగ్ లో .. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు సమస్తం కల్పితాలు.. ఎవరినైనా పోలిఉంటే అది కేవలం యాదృచ్ఛికం అని ఒక డిస్‌క్లయిమర్ వేస్తారు. అలాంటి డిస్‌క్లయిమర్లు మామూలే. కానీ.. వాటిని చాలా ప్రముఖంగా వేసినప్పుడు.. సినిమా మొత్తం.. ఎవడినో ఉద్దేశించి తీశారనే అనుమానాలు మనకు కలుగుతాయి.

ఇది కూడా అచ్చంగా అలాంటి సినిమానే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి.. ప్రజల్లో ఇప్పటికే రకరకాల అభిప్రాయాలు స్థిరపడి ఉండగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా మరియు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారం చేస్తున్న వాదనలను ఎండార్స్ చేయడానికి, అవే సత్యాలు అని ధ్రువీకరించడానికి తీసిన సినిమా ఇది. వివేకానందరెడ్డి కూతురు సునీత భర్త రాజశేఖర రెడ్డే అసలు హంతకుడు అని చాటిచెప్పదలచుకున్న సినిమా! లక్ష్యాలు మనకు స్పష్టంగా అర్థమైపోతాయి.

వివేకానంద కు దయానందగా, జగన్ కు జీవన్ గా, అవినాష్ కు అభిలాష్ గా, సునీతకు అనిత గా.. ఇలా చాలా దగ్గరి పోలికలు ఉన్న పేర్లను పెట్టడం వల్ల ప్రేక్షకులు ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురయ్యే అవకాశం కూడా లేదు. ఎలాంటి సాగతీత లేకుండా వివేకానందరెడ్డి శవాన్ని పనివాళ్లు, పీఏ కృష్ణారెడ్డి చూడడంతోనే సినిమా మొదలవుతుంది. అత్యంత నిజాయితీ పరుడిగా, బాబాయి హత్యను తేల్చదలచుకున్న వ్యక్తిగా ప్రొజెక్టు చేస్తూ.. ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి సుధారావు అనే ఐపీఎస్ అధికారిణికి సిట్ విచారణ బాధ్యతలు అప్పగించడంతో కథ వేగం పెరుగుతుంది.

సాగుతున్న క్రమం గమనిస్తే.. వాస్తవంగా ఉండే అందరు అనుమానితులమీద.. సినిమాలో కూడా అనుమానాల్ని పంపుతూ తీసిన తీరు గమనిస్తే.. సినిమాను పొలిటికల్ గెయిన్ కోసం కాకుండా.. కమర్షియల్ గానే తీసారని, బహుశా హంతకులు ఎవరనేది తేల్చకుండా ఓపెన్ ఎండెడ్ గా వదిలేస్తారని అనిపిస్తుంది. కానీ.. కొంత సినిమా గడిచిన తర్వాత.. సినిమా తీయడం వెనుక అసలు లక్ష్యాలన్నీ నగ్నంగా బయటకు  వస్తాయి. ఇది కేవలం అవినాష్ రెడ్డిని కాపాడడానికి, జగన్ వాదనలను బలపరచడానికి.. స్వయంగా సునీత భర్త రాజశేఖర రెడ్డి కేవలం వివేకా ఆస్తులు ఆయన రెండోభార్య వారసులకు దక్కకుండా ఉండేందుకు చేయించిన హత్యగా ఎస్టాబ్లిష్ చేస్తారు.

ఇంకా పెద్ద ట్విస్టు ఏంటంటే.. ఈ కేసు సీబీఐకు బదిలీ కావడమే అతిపెద్ద కుట్రగా ఈ హత్య సినిమా ఎస్టాబ్లిష్ చేస్తుంది. బహుశా ఇది ఎన్నికలకు ముందు రిలీజ్ చేసి ఉండాలని మేకర్స్ భావించి ఉండవచ్చు. ఈ సినిమా ద్వారా జగనన్న కళ్లలో ఆనందం చూడవచ్చునని నిర్మాత ప్రశాంత్ రెడ్డి ఆశించి ఉండవచ్చు. కానీ.. ఈ జనవరిలో ఇది విడుదలైంది. నిజానికి ఇలాంటి సినిమాలకు ఆదరణ ఉండదు. ఎందుకంటే.. జగన్- అవినాష్ ల వాదన నిజం అని వైసీపీ వారంతా అంటుంటారు. అవినాష్ చంపించాడనేదే నిజం అని తెలుగుదేశం లేదా సునీత సానుభూతి పరులైన వారంతా అంటుంటారు.

తటస్థులు ఈ గొడవను పట్టించుకోరు.. ఇలాంటి పెయిడ్ కూలీ సినిమాలు చెప్పే ఉపదేశాలను చేసే తీర్మానాలను నమ్మరు. కాబట్టి.. ఈ సినిమా ఎన్నికలకు ముందు వచ్చిఉన్నా కూడా జగన్ కు అదనంగా వచ్చే మైలేజీ ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు కూడా.. ఈ సినిమా ఆయన మీద ఎలాంటి జాలి పుట్టించదు. కాకపోతే.. వివేకా కూతురిని మాత్రం విలన్ గా ప్రొజెక్టు చేస్తుంది. నిర్మాత ప్రశాంత్ర రెడ్డి అయినప్పటికీ.. అసలు వెనుకనుండి నడిపించిన పెద్దలు ఎవరనే విషయంలో ప్రజల్లో ఎవరి ఊహలు వారికి ఉంటాయి. అందరి ఊహలు కూడా నిజమే అని అనుకోవచ్చు!

Related Posts

Comments

spot_img

Recent Stories