అప్పుడు చంపినోళ్లకే.. యిప్పుడు చంపేస్తారని భయం!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. నిజానికి ఈ హత్య కేసు విచారణ సీబీఐ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ.. అది స్తంభించిపోయి చాన్నాళ్లే అయింది. జైలుకు వెళ్లిన వాళ్లు అక్కడే, బెయిలు తెచ్చుకోగలిగిన వాళ్లు బాహ్యప్రపంచంలోనే యథేచ్ఛగా తిరుగుతూ వున్నారు. చనిపోయిన వివేకా కూతురు సునీత.. తనకు కాస్త ఖాళీ దొరికినప్పుడెల్లా.. తన తండ్రిని హత్య చేసిన నిందితులను నిగ్గు తేల్చి వారికి శిక్ష పడేలా చూడాలంటూ.. పాలనయంత్రాంగంలో ఉండే పెద్దలందరినీ కలుస్తూ వినతిపత్రాలు ఇవ్వడాన్ని, కోర్టును కదిలిస్తూ ఉండడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. వివేకా హత్య కేసులోని సాక్షులందరూ ఒక్కరొక్కరుగా వేర్వేరు పరిస్థితుల్లో మరణిస్తున్నారు. ఇటీవల వివేకా ఇంటి వాచ్ మేన్ రంగన్న కూడా ఆస్పత్రిలో మృతిచెందిన తర్వాత.. సాక్షులందరూ చచ్చిపోతున్నారనే సంగతి బహుధా వార్తల్లోకి వచ్చింది. ఇదిలా ఉండగా..  ఇప్పుడు హత్య చేసిన పాత్రధారులుగా ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న కీలక నిందితులు కూడా తాము కూడా హత్యకు గురయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమకు పొంచి ఉన్న ప్రమాదం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచే అని కూడా వారు అంటున్నారు.

వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ రెండో నిందితుడుగా ఉన్నారు. ఆయన తాజాగా, ఈ కేసులో తోటి నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చంచల్ గూడ జైలులో ఉన్న సమయంలోనూ తోటి నిందితులు తననుబాగా బెదిరించారని, బయటకు వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. పులివెందులకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులనుంచి కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నట్టుగా ఆయన ఆరోపించడం విశేషం.

ఈ సందర్భంగా ఇటీవల విడుదల అయిన హత్య చిత్రాన్ని కూడా సునీల్ యాదవ్ ప్రస్తావించారు. ఈ సినిమాలో తన పాత్రను, తన తల్లి పాత్రను అత్యంత దుర్మార్గంగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. అవాస్తవాలతో కూడిన ఆ చిత్రాన్ని ప్రదర్శనలు నిలుపు చేయించాలని కూడా ఆయన జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివేకానందరెడ్డి హత్య కేసులో పాత డ్రైవరు దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. సాక్షులందరూ ఒక్కొక్కరుగా మరణిస్తున్న నేపథ్యంలో దస్తగిరి కి ప్రభుత్వం ఇటీవల భద్రత కూడా పెంచింది. దస్తగిరి విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్యలో కీలకంగా పాల్గొన్న నలుగురిలో సునీల్ యాదవ్ కూడా ఉన్నాడు. అయితే.. సాక్షుల కథ అయిపోయింది.. ఇక నిందితుల కథ మొదలవుతుంది అన్నట్టుగా.. తనను చంపేస్తారని సునీల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తుండడం, ఎస్పీకి ఫిర్యాదు చేయడం గురించి విస్తృతంగా ప్రజల్లో చర్చ నడుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories