జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన రోజుల్లో.. అధికారం అండ చూసుకుని చెలరేగుతూ.. రాజకీయ ప్రత్యర్థుల్ని దుర్భాషలాడడం, అసభ్య పోస్టులతో వారి కుటుంబసభ్యులను కూడా అవమానించడం, మార్ఫింగ్ ఫోటోలతో దిగజారుడు ప్రచారాలకు తెగబడడం వంటి అరాచక కార్యకలాపాలకు అసలు తెరవెనుక సూత్రధారులు ఎవ్వరో నెమ్మదిగా బయటకు వస్తోంది. ఏ కేంద్రస్థానం నుంచి ఇలాంటి తప్పుడు పోస్టులు అన్నీ తయారవుతూ వచ్చాయో.. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వివిధ కేసుల్లో అరెస్టు అయిన నిందితులు, విచారణలో వెల్లడిస్తున్న వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. తాజాగా సినీనటుడు పోసాని కృష్ణమురళి.. తన ప్రెస్ మీట్లకు సంబంధించిన స్క్రిప్టులు, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు అన్నీ సాక్షి నుంచే వచ్చేవని, వారు చెప్పినప్పుడే తాను ప్రెస్ మీట్లు పెట్టి వారు ఇచ్చినవి చదివేవాడినని సీఐడీ విచారణలో చెప్పడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ తదితరుల మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెట్టిన కేసుల్లో అరెస్టు అవుతూ రిమాండులో గడుపుతున్న పోసాని కృష్ణమురళిని గుంటూరు సీఐడీ పోలీసులు ఒక్కరోజు కస్టడీకి తీసుకుని విచారించారు. గతంలో ఇదే తరహా కేసుల్లో ఆయన పోలీసుల విచారణను ఎదుర్కొన్నప్పుడు.. తన ప్రెస్ మీట్ల కంటెంట్ సజ్జల రామక్రిష్ణారెడ్డి పంపేవారని అన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు వంటి జవాబులతో దాటవేసినట్టుగానూ వార్తలు వచ్చాయి. తాను లోకేష్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరనందువల్లనే తనమీద కక్ష కట్టినట్టుగా ఆయన చెప్పినట్టుగానూ వార్తలు వచ్చాయి. అయితే.. గుంటూరు సీఐడీ పోలీసుల కస్టోడియల్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా.. తెలుగుమోపో డాట్ కామ్ ఒక ప్రత్యేక కథనం అందించింది. ‘ఇప్పుడైనా నిజాలు చెప్పరాదా పోసానీ’ అనే శీర్షికతో ఆ కథనం ప్రచురితమైంది. పోలీసుల ఎదుట బుకాయించే బదులుగా.. నిజాలు చెబితే.. ఆల్రెడీ రాజకీయ సన్యాసం తీసుకున్నానని, జీవితంలో ఇక రాజకీయాలు మాట్టాడనని అంటున్న పోసానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ కథనం తెలుగుమోపో డాట్ కామ్ అభిప్రాయపడింది. దానికి తగ్గట్టుగానే.. పోసాని కృష్ణమురళి విస్తుగొలిపే విషయాలు చెప్పారు.
తన ప్రెస్మీట్లను మొత్తం నడిపించింది సాక్షి వారేనని తేటతెల్లం చేశారు. అయితే ఆ సాక్షి ప్రతినిధులు ఎవరో తెలియదని, వారిని గుర్తుపట్టలేనని చెప్పారు. మొత్తానికి జగన్ పాలన కాలంలో ప్రత్యర్థుల మీద తయారైన అరాచక పోస్టులకు జన్మస్థానం ఎక్కడున్నదో పోసాని కృష్ణమురళి విచారణలో తెలుస్తున్నది. ఇక సాక్షి మీడియా సంస్థల మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే సాక్షి మీడియా సంస్థకు సీఐడీ నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పోస్టులను తయారుచేసినది ఎవరు, పోసాని ప్రెస్ మీట్ లు కవర్ చేయడానికి వెళ్లినది ఎవరు? వంటి వివరాలు అడుగుతూ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముందు ముందు సాక్షిపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలుంటాయో వేచిచూడాలి.