బాబాయి వైవీ సుబ్బారెడ్డి పై, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు ఇంకా ఆగ్రహం చల్లారినట్టు లేదు. వైవీ కుటుంబంలో విషాదం సంభవించినప్పటికీ కూడా.. ఆమె కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు. వైవీ సుబ్బారెడ్డి.. సొంత తల్లిని కోల్పోతే.. విజయమ్మ, జగన్ అందరూ హాజరయ్యారు గానీ.. వైఎస్ షర్మిల మేదరమిట్టకు రాకపోవడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని.. తమ కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో వైవీ సుబ్బారెడ్డి అబద్ధాలు చెబుతూ.. తనకు చేసిన ద్రోహానికి, ఆయనను షర్మిల ఎప్పటికీ క్షమించబోరని, ఆయనతో ఎప్పటికీ మునుపటి సంబంధాలు కోరుకోరని ఆమె మద్దతుదారులు అంటున్నారు.
వైవీ సుబ్బారెడ్డి స్వయానా వైఎస్ విజయమ్మకు చెల్లెలి భర్త. ఆ రకంగా జగన్, షర్మిలలకు బాబాయి అవుతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం.. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత.. జగన్ కు కుటుంబపరంగా పెద్దదిక్కుగా ఉన్న వారిలో ఆయన కూడా ఒకరు. సొంతంగా పెద్దగా ప్రజాదరణ, పాపులారిటీ ఉన్న నాయకుడు కాకపోవడం వల్ల, కేవలం జగన్ కు మార్గదర్శనం వంటి వ్యవహారాలు ఆయన చూసేవారు. అదే సమయంలో వైఎస్ఆర్ కూతురుగా ఉన్న ప్రజాదరణ కారణంగా.. షర్మిల మాత్రం.. అన్న జగన్ కోసం.. రోడ్డెక్కి ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీని నిలబెట్టడానికి, జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆ పార్టీ కట్టు తప్పిపోకుండా కాపాడడానికి నానా కష్టాలు పడ్డారు.
అయితే 2019లో జగన్ కు అధికారం పట్టిన తర్వాత.. కుటుంబ బంధాల్లో, ఆర్థిక వ్యవహారాలు అనేక విభేదాలకు కారణం అయ్యాయి. వైఎస్ఆర్ జీవించి ఉండగా ఏర్పడిన ఆస్తులన్నీ ఇద్దరు పిల్లలకు సమానంగా చెందాలనేది వైఎస్ కోరికగా, ఆయన భార్య విజయమ్మ చెబుతుండగా.. తన పేరిట, తన భార్య పేరిట ఉన్నవన్నీ తనకే చెందుతాయని జగన్ మొండివాదన వినిపించారు. వైఎస్ షర్మిల రాజకీయ కోరికలను కూడా జగన్ మన్నించకపోవడం వల్ల.. అన్నాచెల్లెళ్ల విభేదాలు మరింత ముదిరాయి. కుటుంబ ఆస్తుల పంపకం బంధువులు, స్నేహితుల మధ్య పంచాయతీదాకా వెళ్లింది.
షర్మిల బయటకు వచ్చి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రాజకీయం చేస్తూ అన్న మీద విరుచుకుపడసాగారు. జగన్ చెల్లెలికి, తల్లికి పంచి ఇచ్చిన ఆస్తులన్నీ తిరిగి తనకు వెనక్కు కావాలంటూ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంలో ఆయన చాలా వ్యూహాత్మకంగా.. తన తరఫు వాదన వినిపించడానికి వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారిని ముందుకు నెట్టారు. వారంతా జగన్ కళ్లలో ఆనందం చూడడానికి ఆయన ఇచ్చిన స్క్రిప్టునే మీడియా ముందు వల్లించి.. షర్మిల మాటలు నిజం కాదని, ఆమెకు హక్కులు లేవని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ అంశాలు షర్మిలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. బాబాయి కూడా అలా మాట్లాడడం బాధ కలిగించిందని ఆమె మీడియా ముఖంగానే తూర్పారపట్టారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి.. షర్మిలతో సంబంధాలను పునరుద్ధరించుకున్న వాతావరణం కనిపిస్తోంది. బాబాయి వైవీ మీద ఆమె ఆగ్రహం అలాగే మిగిలిపోయింది. ఆ నేపథ్యంలోనే.. ఆయన తల్లి పిచ్చమ్మ మరణించిన సందర్భంలో కూడా షర్మిల కనీసం పరామర్శకు వెళ్లలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.