వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ముందు ముందు ఇంకా గడ్డురోజులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. జగన్ చుట్టూ కోటరీ ఉన్నదని, ఆ కోటరీని దాటి జగన్ ను కలవడానికి కూడా సాధ్యం కాదని, జగన్ చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారని.. ఆ కోటరీ కబంధహస్తాలనుంచి బయటపడితే తప్ప.. పార్టీకి మనుగడ కూడా ఉండదని చాలా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విజయసాయి రెడ్డి ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీని విడిచిపెట్టిన తర్వాత.. తనకు జీవితం ప్రశాతంగా ఉంటుందని విజయసాయి తలపోశారేమో తెలియదు గానీ.. పరిస్థితి అంత సానుకూలంగా ఏమీ లేదు. కాకినాడ సీ పోర్టు, సెజ్ వాటాలను బలవంతంగా బెదిరించి దక్కించుకున్నారనే కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటునన్న విజయసాయి రెడ్డిని.. ఏపీ సీఐడీ అధికారులు మరోసారి విచారణకు రావాల్సిందిగా పిలిచారు. ఈసారి విచారణ తర్వాత.. ఆయనను అక్కడే అరెస్టు చేైసే అవకాశం కూడా ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
కాకినాడ పోర్టు, సెజ్ లో వాటాలను వాటి యజమాని కేవీ రావును బెదిరించి వైసీపీ నాయకులు దక్కించుకున్నారనేది ఆరోపణ. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఈ వాటాలను కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. అయితే.. వీరికోసం, విజయసాయి కేవీరావుకు ఫోను చేసి బెదిరించారని సీఐడీ వద్ద కేసు నమోదు అయింది. ఆ తరువాత కొన్నాళ్లకు శరత్ చంద్రారెడ్డి.. తాము గతంలో కొనుగోలు చేసిన వాటాలను కేవీరావుకు తిరిగి అమ్మేశారు. అయినా సరే.. కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. కాగా ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే దిశగా.. ఈడీ వారు కూడా విజయసాయిని గతంలో విచారించారు. సీఐడీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలవడం ఇది రెండోసారి.
తొలిసారి విచారణకు పిలిచినప్పుడు.. ఆయన పోర్టు వాటాల కొనుగోలు వ్యవహారంలో కర్త కర్మ క్రియ అన్నీ వైవీసుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి మాత్రమేనని, తనకే పాపమూ తెలియదని అధికారులతో చెప్పినట్టుగా వెల్లడించారు. అయితే.. ఈ వాటాలు చేతులు మారే ప్రక్రియ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు. పాత్రధారులు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అయినప్పటికీ.. వారి వెనుక ఉన్న కీలక సూత్రధారులు ఎవరు? అంతిమ లబ్ధిదారులు ఎవరు? అనే దిశగా ఇంకా సీఐడీ అధికారులు పలు వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. ఇందుకోసమే విజయసాయిరెడ్డిని మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
జగన్ గురించి అన్ని వివరాలూ త్వరలో చెబుతానని గతంలో ఒక బాంబు వేసిన విజయసాయిరెడ్డి.. రెండోసారి విచారణలో కీలకమైన సంగతులు చెబుతారా? లేదా, ఆయననుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సీఐడీ అధికారులు అరెస్టు చేస్తారా? అనే చర్చోపచర్చలు సాగుతున్నాయి.