చేతగానితనం బయటపడుతున్నప్పుడే మనిషిలో అసహనం హద్దులు దాటుతుంది. తమ లోపాలను గుర్తించలేని, తమ చేతగానితనాన్ని సరిదిద్దుకోలేని సమయంలో హద్దు మీరి మాట్లాడడం.. ఇతరుల మీద నిందలు వేయడం ద్వారా బతికి పోతామని ఆశ పడడం చాలా సహజం. విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ రాజకీయాలలో శరవేగంగా వస్తున్న మార్పు చేర్పుపులను గమనిస్తే.. ఈ సంగతి మనకు మరింత బాగా అర్థమవుతుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే తమకిక ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతో ఆ పార్టీని వీడి తెలుగుదేశం వైపు వెళుతున్న కార్పొరేటర్ లను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది. తమ వారిని కంట్రోల్ చేయడం చేతగాని స్థితిలో.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాను కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీప్ పాలిటిక్స్ మానుకోవాలని గుడివాడ అమర్నాథ్ అవాకులు చవాకులు పేలుతున్నారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక రకమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురయ్యారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు మాత్రం పరిమితమైన, కనిష్ట ప్రజాదరణ ఉన్న పార్టీ నాయకుడిగా మారిపోవడం మాత్రమే కాదు. ఆయన పార్టీని నిర్వహిస్తున్న తీరు, నష్ట నివారణకు తీసుకుంటున్న చర్యలు పార్టీ నాయకులను మరింతగా భయపెట్టాయి. ఈ పార్టీలోనే కొనసాగితే తమకు ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తు ఉండదని వారంతా ఆందోళన చెందారు. దానికి తగ్గట్టుగా సార్వత్రిక ఎన్నికలు అయిన వెంటనే విశాఖలో కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశం లను మరికొందరు జనసేన బిజెపిలలోనూ చేరిపోయారు. తాజాగా మరో 9 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
రేపో మా పో విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్ ని కలిసి సన్నాహాలు కూడా చేసినట్లుగా చెబుతున్నారు. వారిని కంట్రోల్ చేసి పార్టీలోనే కొనసాగేలా చేయడానికి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు నాయకులను పురమాయించింది. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు తో గుడివాడ అమర్నాథ్ కూడా ఆ నష్టనివారణ నేతల్లో ఉన్నారు. కానీ వారి మాటలను ఈ కార్పొరేటర్లు ఎవరూ ఖాతరు చేయలేదు.
స్థానిక నాయకులుగా కార్పొరేటర్లను బుజ్జగించి పార్టీలోనే ఉంచడంలో వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ చేతకానితనాన్ని కప్పెట్టుకోవడానికి గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద అర్థం పర్థం లేని దారుణమైన విమర్శలు చేస్తున్నారు. తమ కార్పొరేటర్లను బెదిరిస్తే సహించేది లేదని, అధికారం శాశ్వతం కాదని, మళ్లీ తమ ప్రభుత్వం రాగానే అసలైన రాజకీయం వారికి చూపిస్తామని.. రకరకాల మేకపోతు గాంభీర్యపు పలుకులు అంటున్నారు. కార్పొరేటర్లు.. వారి మాట వినే పరిస్థితే ఉంటే.. పాపం ఆయనకు ఇన్ని మాటల అవసరం ఏం ఉంటుందోమరి!