సినీనటుడు పోసాని కృష్ణమురళిని, ఏపీ సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడానికి కోర్టు అనుమతించింది. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత.. ఆయనను సీఐడీ అధికారులు విచారిస్తారు. జగన్ ప్రభుత్వ కాలంలో, ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం రెచ్చిపోయి వ్యవహరించిన, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన పాపానికి పోసాని కృష్ణమురళిపై రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. అరెస్టు అయిన తర్వాత ఆయనకు బెయిల్ లభించిన సమయానికి గుంటూరు సీఐడీ పోలీసులు మరో కేసులో పీటీ వారెంటు తీసుకోవడంతో మళ్లీ అరెస్టు అయ్యారు. కస్టడీ విచారణకు కోర్టు అనుమతి కోరడంతో ఒకరోజు విచారణకు అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. అయితే ఇన్నాళ్లుగా న్యాయస్థానాలు జైళ్లు తిరుగుతూ పరిస్థితులపై ఒక అవగాహన తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి ఇప్పటికైనా విచారణలో నిజాలు వెల్లడిస్తే బాగుంటుందని, ప్రజలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
జగన్ పరిపాలన సాగుతున్న రోజుల్లో పోసాని కృష్ణమురళి చాలా రెచ్చిపోయారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ల మీద విచ్చలవిడిగా ఆయన అసభ్య పదజాలంతో విమర్శలు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో అసభ్య పోస్టలు సోషల్ మీడియాలో పెట్టారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. జగన్ ను ప్రసన్నం చేసుకోవడం కోసం అలాంటి తప్పుడు పని చేసినందుకు.. పోసాని కృష్ణమురళికి తగిన ప్రతిఫలం లభించింది. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎప్‌డీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆ పదవిలో ఉండగా కూడా ఆయన ప్రతి సందర్భంలోనూ రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్య దూషణలతో రెచ్చిపోతూనే వచ్చారు.
కానీ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆయనకు సీన్ అర్థమైంది. చాలా తొందరగానే ఆయన జాగ్రత్త పడ్డారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ఆయన ప్రకటించారు. ఇకపై రాజకీయాల జోలికి రానని, రాజకీయాలు మాట్లాడనని కూడా అన్నారు. అయితే చేసిన పాపాలు సన్యాసం వల్ల వదలిపోవు అన్నట్టుగా.. ఆయన మీద వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి.
అన్నిచోట్ల ఒకే రకమైన కేసులు, ఒకే రకమైన విచార. ఇలాంటి పోస్టులు పెట్టమని మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? అందుకు ప్రతిఫలంగానే మీకు పదవి ఇచ్చారా? లాంటివి పోలీసులు సహజంగా అడుగుతున్నారు. అయితే నిజాలు చెప్పడానికి మాత్రం పోసానికి మనసు రావడం లేదు. వసీపీ దళాలు అందరికీ అలవాటు అయిన.. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా వంటి డొంకతిరుగుడు సమాధానాలే చెబుతూ నెట్టుకొస్తున్నారు తప్ప.. నిజాలు మాట్లాడడం లేదు. నిజాల చెప్పకుండా.. తాను కేసు నుంచి బయటకు రాలేను అనే వాస్తవాన్ని ఆయన గుర్తించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఐడీ పోలీసుల కస్టోడియల్ విచారణలో అయినా ఆయన నిజాలు చెప్పాలని.. వారు భావిస్తున్నారు.