పోలీసులను టార్గెట్ చేస్తున్న వైసీపీ రౌడీ మూకలు!

రాజకీయ ప్రత్యర్థులను ఏకంగా వేటకొడవళ్లతో అంతం చేసేస్తున్నారు. దాడులు చేసి చితక్కొడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ మూకలు అక్కడితో ఆగడం లేదు. ఇప్పుడు వారు ఏకంగా పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు. పోలీసులపై రాళ్లదాడులకు తెగబడుతున్నారు. వారిని కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం సిద్ధంగా ఉన్న వైసీపీ రౌడీ మూకలు.. ఏకంగా రాళ్లదాడితో పోలీసుల మీదికి విరుచుకుపడ్డారు. నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా గాయపడ్డారు. గాయపడిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాల్సిన పరిస్థితి. అసెంబ్లీ జరిగేప్పుడు సమావేశాలకు రాకుండా పారిపోతూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. ఎక్కడైనా చిన్న వ్యక్తిగత కక్షల దొమ్మీలు జరిగినా కూడా.. తగుదునమ్మా అంటూ బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో విశ్రాంతి నుంచి బయటకు వచ్చి.. వైఎస్సార్ కాంగ్రెస్ వారిని టార్గెట్ చేసి కొడుతున్నారని.. నంగనాచి కబుర్లు చెబుతూ ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీకి చెందిన రౌడీ మూకలు ఏకంగా పోలీసుల మీదనే దాడిచేసి.. ఆస్పత్రి పాలయ్యేలా రాళ్లతో కొడుతోంటే.. నోరు మెదపకుండా ఏ కలుగులో దాక్కున్నారు.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కోడికత్తితో తనను హత్య చేయడానికి ప్రయత్నించారంటూ ఒక కామెడీ ప్రచారం చేసుకుని.. ప్రజలను వంచించి.. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారం దక్కించుకున్నారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఆకతాయి విసిరిన రాయి తలకు తగిలి, అతిచిన్న గాయం అయింది. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగా.. అంత చిన్న గాయానికి అతిపెద్ద బ్యాండేజీ వేసుకుని ఎన్నికల ప్రచారపర్వం మొత్తం తన మీద హత్యాయత్నం జరిగిందంటూ నాటకం రక్తికట్టించారు జగన్. రాయివిసిరిన వ్యక్తి అంటూ ఒక అమాయకుడిని పట్టుకుని.. తెలుగుదేశం కార్యకర్తగా రంగుపులిమే రాజకీయం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. హత్యారాజకీయాలు పెరిగిపోయాయని రాష్ట్రంలో.. రాష్ట్రపతి పాలన విధించాలని పలు వినతులు చేశారు.
తీరా ఇప్పుడు పుంగనూరులో జరిగినది ఏమిటి. అచ్చమైన రాజకీయ హత్య. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన గూండాలు.. తెలుగుదేశం పోలింగ్ ఏజంటుగా కూర్చున్నందుకు వ్యక్తిని వేటకొడవళ్లతో హతమార్చారు. ఇప్పుడు పెనుగంచిప్రోలులో జరిగింది ఏమిటి? వైసీపీ గూండాలు పోలీసుల మీదికే రాళ్లురువ్వి వారిని ఆస్పత్రి పాల్జేశారు. ఇలాంటి దుర్మార్గాలకు జగన్ ఎలాంటి సంజాయిసీ చెబుతారు. జగన్ ను అవమానిస్తే.. కార్యకర్తలకు కడుపుమండి తెలుగుదేశంఆఫీసుపై దాడిచేయకుండా ఉంటారా? అని సమర్థించుకున్న సజ్జల లాంటి వాళ్లు ఈ వైసీపీ గూండాల దుశ్చర్యలను గురించి కూడా తమ అభిప్రాయం వెల్లడిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories