కూటమి వచ్చినతర్వాతే వారికి గౌరవం దక్కింది!

జగన్మోహన్ రెడ్ది ముఖ్యమంత్రిగా పాలన సాగించిన కాలంలో కూడా వారు ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసుకున్నారు. అయినా సరే.. ఆయన సర్కారు పట్టించుకోలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి వినతులకు మోక్షం వచ్చింది. తెలంగాణకు చెందిన చట్టసభల ప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలకు తిరుమల వేంకటేశ్వరుని దర్శనంలో ప్రాధాన్యం కల్పించే విధానానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. మార్చి 24వ తేదీనుంచి వీరి సిఫారసు ఉత్తరాల్ని అనుమతించబోతున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.

రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచి కూడా.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు ఉత్తరాలకు కూడా తిరుమలలో ప్రయారిటీ ఉండేది. వీఐపీబ్రేక్, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లకు వీరి సిఫారసు ఉత్తరాలను పరిగణనలోకి తీసుకుంటుండేవారు. కాని కోవిడ్ రోజుల్లో ఆంక్షలు వచ్చాయి. ఆ తరువాత.. దర్శనాలన్నీ యధాపూర్వం పునరుద్ధరించినప్పటికీ.. తెలంగాణ నేతల ఉత్తరాలకు పరిగణన మాత్రం దక్కలేదు. జగన్ ప్రభుత్వ కాలంలోనే వారు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ.. ప్రభుత్వం గానీ, టీటీడీ ధర్మకర్తల మండలి గానీ ఏమాత్రం పట్టించుకోలేదు.

కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలంగాణ నేతల సిఫారసులకు కూడా బ్రేక్ దర్శనాల అవకాశం కల్పించనున్నట్టుగా బోర్డు ఛైర్మన్ బిఆర్ నాయుడు.. తాను పదవి స్వీకరించిన తొలినాళ్లలోనే ప్రకటించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబునాయుడు కూడా ఆమోదం తెలిపారు. టెక్నికల్ గా ఆమోదం లభించింది గానీ.. కార్యరూపంలోకి రావడం ఆలస్యం అయింది. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ, అలాగే తెలంగాణ బిజెపి ఎంపీ రఘునందన్ రావు తదితరులు.. తిరుమలలో తమ సిఫారసు ఉత్తరాలను ఖాతరు చేయకపోవడం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ టాపిక్ మళ్లీ తెరమీదకు వచ్చింది.

టీటీడీ ధర్మకర్తల మండలి చొరవ తీసుకుని.. మార్చి 24 నుంచి తెలంగాణ నేతల సిఫారసు ఉత్తరాలు తీసుకోనున్నట్టుగా ప్రకటించింది. వారినుంచి వారానికి నాలుగు లేఖలను అనుమతిస్తారు. రెండు లేఖలు వీఐపీ బ్రేక్ దర్శనానికి, రెండు లేఖలు రూ.300 ప్రత్యేక దర్శనానికి ఇచ్చే వెసులుబాటు ఉంటుంది.
వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆది, సోమవారాల్లో స్వీకరించి.. వారికి సోమ, మంగళవారాల్లో దర్శనం కల్పిస్తారు. రూ.300 టికెట్లకు ఇచ్చే లేఖలను మాత్రం.. బుధ, గురువారాల్లో స్వీకరించి అదే రోజున దర్శనం కూడా కల్పిస్తారు. ఒక లేఖమీద గరిష్టంగా ఆరుగురు దర్శనానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ల తర్వాత.. తెలంగాణ నేతల సిఫారసు ఉత్తరాలను స్వీకరించే ఏర్పాటును అనుమతించినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు , తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories