దోపిడీ సేమ్ : అక్కడ ఒక్కరు.. ఇక్కడ పదిమంది!

వారందరూ కూడా.. లక్షల మంది ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ప్రతినిధులుగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వారి ప్రాథమిక బాధ్యత ఏమిటి? ఎన్నుకున్న ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించడమే కదా? అయితే ఆ పని మాత్రం వారు చేయరు. ప్రజలు భిక్ష పెట్టిన ఎమ్మెల్యే ఉద్యోగాన్ని, ఒక వైభవచిహ్నంగా అనుభవించడానికి మాత్రం రెడీగా ఉంటారు. లక్షలకు లక్షల జీతాలు మాత్రం పుచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. వారికి అప్పగించిన పని చేయకుండా జీతాలు తీసుకుంటున్న వాళ్లు కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. పొరుగున తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ప్రస్తావిస్తూ.. 15నెలల  కాలంలో ఆయన కేవలం రెండు రోజులు మాత్రం శాసనసభకు వచ్చి, 57 లక్షల రూపాయల జీతం తీసుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసిన నేపథ్యంలో ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుమీద కూడా ప్రజల దృష్టి మళ్లింది.

తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే, అంటే కేసీఆర్, శాసనసభకు రాకుండా జీతం తీసుకుంటూ ఉన్నందుకే సీఎం అంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఏపీలో ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చేది లేదు.. అని అదేదో హీరోయిజంలాగా ప్రకటించుకుంటూ.. జీతాలకు మాత్రం తగుదునమ్మా అని డ్రా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండడాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు. తెలంగాణ చర్చ తర్వాత ఆరాలు తీస్తే.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తన జీతం డ్రా చేయడం లేదని, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ జీతాలు డ్రా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అసెంబ్లీకి హాజరు కాకుండా..జీతాలు మాత్రం తీసుకోవడానికి నైతికంగా వారికి ఏం హక్కు ఉన్నదనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది. ఇప్పుడు మాత్రమే కాదు.. ప్రజల్లో తమ గురించి జరుగుతున్న చర్చతో సిగ్గుపడిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.. శాసనసభకు హాజరయ్యేందుకు జగన్ ను ఒప్పించాలని సీనియర్లను కోరుతున్నట్లుగా సమాచారం. గతంలో జగన్ శాసనసభకు వెళ్లరాదని నిర్ణయించినప్పుడు కూడా ఆ పార్టీలోని 10 మంది ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్ష నేత హోదా దక్కనందుకు అలిగి జగన్ రాకుండా ఆగిపోవచ్చు గానీ.. తాము కూడా సభకు వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే.. తమను గెలిపించిన ప్రజలు అసహ్యించుకుంటారని, ఇక్కడితో తమ తమ రాజకీయ జీవితానికి సమాధి అవుతుందని వారు ఆందోళన చెందారు. అయితే వారి భయాలను జగన్ఱ పట్టించుకోలేదు. నేను సభ వెలుపలినుంచి పోరాటం చేస్తా అంటున్న జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రెస్ మీట్లు పెడుతున్నారు గానీ.. పాపం ఆ పార్టీ మిగిలిన పది మందికి అందుకు కూడా అవకాశం లేదు. సభకూ కనిపించకుండా.. మీడియాలోనూ కనిపించకుండా బతుకుతుండడంతో.. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరంటే.. ఒకటిరెండు పేర్లు తప్ప ప్రజలు కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. జీతాలు మాత్రం తీసుకుంటూ ఎమ్మెల్యే పనిచేయకుండా ఉన్న వారి తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories