విజయసాయి పాపాల్ని కూకటి వేళ్ళతో పెకలిస్తున్నారు!

జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక, అరాచక పరిపాలన సాగించిన రోజుల్లో.. ఆయన తర్వాత నెంబర్ టు స్థానంలో చెలరేగిపోయిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇవాళ జగన్ వలన తాను ఎంతో నష్టపోయానని బూటకపు ప్రేలాపనలతో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఆ పార్టీ నుంచి వెలుపలికి వచ్చి సచ్ఛీలుడు అయిపోయినట్లుగా బిల్డప్ ఇవ్వడానికి ఆయన నానా ప్రయాస పడుతున్నారు. కానీ రాజకీయ సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాన గతంలో చేసిన తప్పులన్నీ మరుగున పడిపోతాయి అనుకుంటే పొరపాటే అని ప్రతి రోజు నిరూపణ అవుతున్నది. మొన్నటికి మొన్న కాకినాడ పోర్టు, సెజ్ వాటాలు దక్కించుకోవడంలో అల్లుడు చేసిన దందాల విషయంలో సంజాయిషీ చెప్పుకోవడానికి ఆయన ఏపీ సిఐడి దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఆయన కూతురు నేహారెడ్డి ఏకంగా సముద్ర తీరాన్ని ఆక్రమించేసి చట్టాన్ని అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు సమూలంగా కూల్చివేశారు.
విశాఖపట్నం భీమిలి వద్ద విజయసాయి కూతురు నేహా రెడ్డి ఆక్రమణలకు పాల్పడి కాంక్రీట్ గోడల నిర్మాణం చేపట్టి దందా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నిర్మాణాలను కూల్చివేయాల్సిందిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు స్పష్టంగా ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం గోడలను తొలగించడంలో తూతూ మంత్రంగా మమ అనిపించారు. ఇదే విషయమై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించి అక్కడ జరుగుతున్న అరాచకత్వం గురించి, అధికారుల నిర్లక్ష్యం గురించి ఫిర్యాదు చేయడంతో హైకోర్టు తీవ్రంగా మందలించింది. దీంతో బుద్ధి తెచ్చుకున్న అధికారులు 10 అడుగుల లోతుకు తవ్వి కాంక్రీట్ గోడల పునాదులతో సహా వాటిని తొలగిస్తున్నారు. ఈ గోడలు తొలగించడానికి అయ్యే ఖర్చును కూడా నేహా రెడ్డి దగ్గర నుంచే వసూలు చేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించింది.

మొత్తానికి విజయసాయి తాను తెరవెనక ఉండి కూతురి పేరిట, అల్లుడి పేరిట నడిపించిన రకరకాల అరాచకాలకు కూటమి ప్రభుత్వం చరమగీతం పాడుతోంది. ‘ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నాను.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను..’ అని పరిశుద్ధుడు అయిపోయినట్లుగా మాటలు చెబుతున్న విజయసాయి పాత పాపాల పర్యవసనాలను ఎదుర్కోవడానికి ఏ రకంగా సిద్ధపడతారో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories