టాలీవుడ్ పవర్ స్టార్ రో, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు అని ఆయన అన్నారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా..” మీ హిందీ భాషను మా వద్ద మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.. స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని.. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ ” అంటూ దండం పెడుతున్న ఏమోజీ తో కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలేమైందంటే.. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇలా పెద్ద వివాదానికి తెర తీశాయనే చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ..” మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నాను అంటారు. అన్నీ దేశ భాషలే కదా .. తమిళనాడులో హిందీ రాకూడదని అంటుంటే, నాకు ఒకటే అనిపించింది. తమిళ్ సినిమాలు మరి హిందీలో డబ్బింగ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గడ్, బీహార్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తాం అంటే ఎలా? ఇదెక్కడి న్యాయం.. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్షత అనుభవించాను. గోల్టీ, గోల్టీ అని నన్ను చాలామంది అవమానించారు కూడా..” అంటూ పవన్ కళ్యాణ్ సభలో చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా ఇంకొక వైపు విద్యా విధానంపై అటు తమిళనాడు, ఇటు కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి గుర్తును తొలగించి ఆస్థానంలో ” రూ” మాత్రమే వచ్చేలా అక్షరాన్ని చేర్చడం జరిగింది. దీంతో తమిళ్, హిందీ భాషల మధ్య వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తుంది. ఇకపోతే మాతృభాషను కాపాడుకోవడానికి తీసుకున్న చర్యగా తమిళ సంఘాలు కూడా అభివర్ణించాయి. కానీ మరి కొంతమంది జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా వివాదం రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడంపై డిఎంకె కూడా వ్యతిరేకిస్తూ కామెంట్ చేయగా.. సీఎం స్టాలిన్ కూడా దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు విద్యార్థులు ఎందుకు మూడో భాషను నేర్చుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో మాకు చెప్పండి. ఆ తర్వాతే మేము ఆలోచిస్తాము. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధించి, ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసం. అయినా ఇక్కడ విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?” అంటూ కూడా ఆయన ప్రశ్నించారు.