అయిదేళ్లపాటు స్మశానంలాగా మారిపోయి కుమిలిన అమరావతి నగరం కొత్తగా పండుగ శోభను సంతరించుకుంటోంది. గతంలో ఆగిపోయిన నిర్మాణ పనులన్నీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని- అనే ఏ నినాదాన్ని నమ్మి తెలుగు ప్రజలు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారో… ఆ అమరావతి స్వప్నాన్ని సాకారం చేసే పనులు ఏప్రిల్ లో పునః ప్రారంభం కానున్నాయి. గతంలో ఎన్డీయే ప్రభుత్వం హయాంలోనే అమరావతి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ.. ఇన్నేళ్ల విరామంత తర్వాత.. పునరుజ్జీవానికి సిద్ధం అవుతున్న నగర పునఃనిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన తానే చేయబోతున్నారు. ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్యలో ప్రధాని చేతులమీదుగా పునఃనిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఏపీ ప్రజలు ఎన్డీయే కూటమి పార్టీలను అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా అమరావతి రాజధాని అనే స్వప్నానికి తమ మద్దతును స్పష్టంగా తెలియజేశారు. ఏపీ వైపు యావత్తు ప్రపంచం తలతిప్పి చూసే విధంగా అద్భుత రాజధానిని నిర్మిస్తానని గతంలో ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు మాట ఇస్తే.. తర్వాత సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి.. మూడు రాజధానుల పేరిట.. రాష్ట్రాన్ని మూడుముక్కలాటగా మార్చి రాష్ట్ర భవిష్యత్తును అగమ్యగోచరంగా చేసేశారు. ఈ ప్రతిపాదనల ద్వారా అమరావతిని సమూలంగా నాశనం చేయాలనుకున్న జగన్ దురాలోచనకు ఆ ప్రాంత రైతులే అడ్డుగా నిలిచారు. అయిదేళ్లపాటూ అలుపెరగని పోరాటం సాగించారు. న్యాయస్థానంలో వారి వాదన విజయం సాధించినా.. జగన్ అమరావతి నిర్మాణాల గురించి పట్టించుకోలేదు.
ప్రజల తీర్పుతో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే.. అమరావతిలో సగం నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాలు అడవుల్లాగా తయారై ఉండగా.. వాటన్నింటినీ శుభ్రం చేయించారు. నిర్మాణాలు తిరిగి ప్రారంభించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. నిపుణులతో పూర్తయిన నిర్మాణాల నాణ్యతను పరిశీలింపజేశారు. ఈ కసరత్తుకు సమాంతరంగా.. అమరావతి నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లడానికి సీఆర్డీయే అంతర్జాతీయంగా రుణాలకు ప్రయత్నాలు సాగించింది. కేంద్రం కూడా ఈ విషయంలో ఘనంగా సహకరించింది.
మొత్తానికి తొలిదశలో రాజధానిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 64721 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ప్రస్తుతానికి 37702 కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తిచేశారు. యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 17న కేబినెట్ సమావేశంలో ఆమోదం తరువాత టెండర్లులో పనులు పొందిన కాంట్రాక్టు ఏజన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు కూడా జారీ చేయబోతున్నారు. ఏప్రిల్ లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. మూడేళ్లలోగా ఈ పనులన్నీ పూర్తిచేయాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. మొత్తానికి అమరావతిని స్వప్నిస్తున్న రాష్ట్రప్రజలకు ఏప్రిల్లో గొప్ప పండుగ రానున్నదని ప్రజలు అనుకుంటున్నారు.