బిగ్ షాట్స్ ను జైల్లో పెట్టలేదని బాలినేని అసంతృప్తి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పరిపాలన తీరు మీద, తీసుకుంటున్న నిర్ణయాల మీద అనేకమంది వ్యక్తుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండవచ్చు. ప్రభుత్వ నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే వారు కూడా కొందరు ఉంటారు. కానీ కూటమి పార్టీలకే చెందిన నాయకులు తమలో అసంతృప్తి ఉన్నా కూడా బయట పెట్టరు. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని ప్రభుత్వంలోని నెగటివ్ అంశాలు బయట మాట్లాడకూడదని నియమం పాటిస్తారు. కానీ జనసేన లో ఉన్న సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ సూత్రాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వం పట్ల అసంతృప్తి ని ఆయన బహిరంగంగా వెళ్ళగక్కుతున్నారు.
ఎన్డీఏ కూటమి పరిపాలన మొదలైన తర్వాత, ఇప్పటిదాకా వివిధ తప్పులు చేసిన చిన్న చిన్న వ్యక్తులు మాత్రమే అరెస్ట్ అవుతున్నారనేది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కాములు చేసి కోట్ల రూపాయలు సంపాదించిన వారిని ఇంకా అరెస్టు చేయనేలేదని, అదే నా బాధ అని బాలినేని అంటున్నారు.


వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి స్వయంగా మామయ్య అయ్యే బాలినేని శ్రీనివాసరెరడ్డి గత ప్రభుత్వ కాలంలో ఒక దఫా మంత్రి పదవి కూడా అనుభవించారు. విద్యుత్తు శాఖ మంత్రిగా ఉంటూ.. అనేక అరాచక ఒప్పందాలను తన సంతకాలతో సంబంధమే లేకుండా పూర్తిచేసేశారని కూడా ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ మాటలకు డూడూ బసవన్నలా తల ఊపడం లేదనే కారణంతో.. ఆయనకు జగన్ హయాంలో మంత్రిపదవి మధ్యలో పోయింది. 2024 ఎన్నికల తర్వాత ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేసేసి జనసేనలో చేరారు.
జగన్ ప్రభుత్వంలో అరాచకాలు ఎలా జరిగాయో.. ప్రధానంగా అదానీ సంస్థలతో విద్యుత్తు ఒప్పందాలు జరిగిన తీరు ఎలాంటిదో.. అప్పట్లో తానే మంత్రి గనుక.. చాలా విపులంగా వివరించి చెప్పారు బాలినేని. అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు మొత్తం చక్రం తిప్పి అవనీతి బాగోతాలను నడిపించినట్టుగా ఆయన ఫిర్యాదు కూడా చేశారు.


కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ.. అసలు ప్రధాన అవినీతిపరులైన వారిని అరెస్టు చేయకపోవడం బాలినేనికి బాధ కలిగిస్తున్నది. ఇప్పటిదాకా జరుగుతున్న అరెస్టులన్నీ.. సోషల్ మీడియా పోస్టులు, అసభ్యపు తిట్లు తదితర వ్యవహారాలకు సంబంధించినవి మాత్రమే. వందల వేల కోట్లు కాజేసిన కేసుల్లో ఇంకా పురోగతి పెద్దగా లేదు. బాలినేని.. తమ పార్టీ ఆవిర్భావ సభలో అదే విషయం ప్రస్తావించిన బాలినేని, తాను చచ్చేవరకు పవన్ వెంటే ఉంటానని అంటూనే, చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అని జగన్ తెలుసుకోవాలని హెచ్చరించడం గమనార్హం

Related Posts

Comments

spot_img

Recent Stories