పోసాని కృష్ణమురళి తీరుతెన్నుల్లో ఏమాత్రం మార్పు వచ్చినట్టుగా కనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం కాలంలో.. ఆయన ప్రాపకం కోసం రెచ్చిపోయి ప్రవర్తించిన పోసాని.. ప్రభుత్వం మారిన వెంటనే జాగ్రత్త పడ్డారు. ఈ ఓటమి తర్వాత.. జగన్ మళ్లీ గెలవబోయేది ఉండదని తనకు కూడా అర్థమైనట్టుగా పోసాని కృష్ణమురళి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. 67 ఏళ్ల వయసులో ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించడమే ఒక చిత్రమైన సంగతి. కేవలం కేసుల భయంతో.. సన్యాసం డ్రామా ఆడారు గానీ.. అందుచేత చేసిన పాపాలు మాసిపోవు అని నిరూపణ అయింది. వివిధ కేసుల్లో ఆయన అరెస్టు అయ్యారు. వివిధ జైళ్లు తిరుగుతున్నారు. అయినా సరే.. ఇప్పటికీ ఆయనకు తెలివి వచ్చినట్టు లేదు. ఇక రాజకీయాలు మాట్లాడను అని ప్రకటించిన పోసాని.. లోకేష్ మీద చవకబారు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. తన విమర్శలను ప్రజలు నమ్మరని, దాని వల్ల తాను సాధించేదేమీ లేదని తెలిసికూడా ఆయన అదే తీరులో ఉండడం గమనార్హం.
ఒకవైపు బెయిల్ దక్కినా కూడా అప్పటికే వేరే కేసులో పీటీ వారంటుతో అరెస్టు కారణంగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చిన పోసాని కృష్ణ మురళి ఒక వైపు తాను నార్కో ఎనాలిసిస్ టెస్టుకు కూడా సిద్ధమే అంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య, అవమానకర పోస్టులు పెట్టడమే ఆయన మీద ఉన్న అసలు కేసు కాగా.. అందులో నార్కో అనాలిసిస్ టెస్టు అవసరమేంటో.. ఆయన అంత పెద్ద పదాలు ఎందుకు వాడుతున్నారో అర్థం కావడం లేదు.
ఇంతకూ పోసాని తాజాగా చేస్తున్న రాజకీయ ఆరోపణ కామెడీ ఏంటో తెలుసా? పోసానిని టీడీపీలోకి రావాల్సిందిగా నారా లోకేష్ ఆహ్వానించారట. రాను అని చెప్పినందుకు వేధిస్తున్నారట. అసలు పోసాని తన గురించి తాను ఎందుకంత అతిగా ఊహించుకుంటున్నారో అర్థం కావడం లేదని ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీకి కొమ్ముకాస్తూ.. జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడం కోసం రెచ్చిపోయి మాట్లాడుతూ.. కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించిన పోసానిని తెలుగుదేశంలోకి నారా లోకేష్ ఎందుకు ఆహ్వానిస్తారు? అసలు ఆయనకు ఉన్న ప్రజాదరణ ఏపాటిది? ఏ మాత్రం ప్రజాదరణ ఉన్నా.. ఆయన ఎన్నడో ఎన్నికల్లో గెలిచి ఉండేవారు. మాటల ఆర్భాటమే తప్ప ప్రజల్లో విలువలేని వ్యక్తికోసం నారా లోకేష్ ఎందుకు ఆహ్వానిస్తారనేది ప్రశ్న.
పోసాని కృష్ణమురళి- రాజకీయాలు మాట్లాడను అన్న తరువాత.. పూర్తిగా నిజాలు చెబితే తప్ప.. కేసుల్లోంచి బయటపడే అవకాశం లేదని నిపుణుడు అంటున్నారు. ఒకవైపు తనకు వయసు అయిపోయింది అంటున్నారు. అసలు కూర్చోలేకపోతున్నానని అంటున్నారు. అలాంటప్పుడు.. ఇంకా వైసీపీ ప్రాపకం కోసం ఆరాటపడకుండా.. వాస్తవాలు దాచకుండా.. ఆయన అలాంటి అసభ్య, తప్పుడు పోస్టులు పెట్టడం వెనుక ఎవరి ప్రేరేపణ ఉన్నదో ఒప్పుకుని లెంపలు వేసుకుంటే తప్ప ఆయన పాపానికి నిష్కృతి లేదని ప్రజలు అంటున్నారు.