ఏదో నామ్ కే వాస్తేగా మనుగడలో ఉండే పార్టీ కాకుండా.. ఒకసారి అధికారం చలాయించి మళ్లీ అధికారంలోకి రావాలనే తపన కూడా కలిగి ఉన్న రాజకీయ పార్టీ.. తమ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా ఆర్భాటంగా జరుపుకోవాలని భావించడం సహజం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసి కట్టుగా నిర్వహిస్తే.. ఆ పార్టీ ‘దుకాన్ బంద్’ దిశగా ఉన్నదని విమర్శలు వస్తాయనే భయంతోనైనా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. కానీ ఐదేళ్లపాటు విచ్చలవిడిగా రాజ్యం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆవిర్భావ దినోత్సవ సభ తాజాగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో అత్యంత సింపుల్ గా జరిగింది. ఏమాత్రం ఆర్భాటం లేదు. ప్రజల, కార్యకర్తల, అభిమానుల వెల్లువ లేదు! ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కొత్తదనం లేని, ప్రభుత్వం మీద పాచిపోయిన విమర్శలతోనే సరిపెట్టారు. అంతేతప్ప.. అత్యంత దారుణంగా ఓడిపోయి పార్టీ ఉంటుందా? మునుగుతుందా? అనే మీమాంసలో ఉన్న కార్యకర్తలకు స్ఫూర్తి, ధైర్యం ఇవ్వలేకపోయారు. అయితే తాడేపల్లి వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగానే నిర్వహించాలని అనుకున్నారని, కొన్ని కారణాల వలన ఆ ఆలోచన రద్దు చేసుకొని సింపుల్ గా ముగించారని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరం కడప జిల్లాలోనే తమ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత జిల్లాలోనే వైసిపి 15వ ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఘనమైన స్థాయిలో నిర్వహించాలని తొలుత భావించినట్టు అంటున్నారు. లక్షల మంది జన సమీకరణతో వైసీపీ పట్ల ప్రజలలో ఆదరణ చెక్కుచెదరలేదని ఆయన తరచుగా చెప్పే మాటలను నిరూపించుకోవాలని అనుకున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కీలక నాయకులతో మాట్లాడినప్పుడు, జగన్ తరఫున ఇతర నాయకులు ఆవిర్భావ సభ నిర్వహణ గురించి మంతనాలు జరిపారు. అన్ని జిల్లాల నుంచి ఏ మేరకు జనాన్ని సమీకరించగలరు అక్కడి నాయకులను విచారించి తెలుసుకున్నారు.
అయితే ‘ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి ఆర్థిక వనరులు మొత్తం ఊడ్చుకుపోయిన దశలో ఉన్న తాము పార్టీ ఆవిర్భావ సభ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి జనాన్ని తరలించే స్థితిలో లేము’ అని అనేకమంది నాయకులు కుండబద్దలు కొట్టినట్టుగా సమాచారం. పార్టీ నుంచి నిధులు ఇస్తే ఆవిర్భావ సభకు జనాన్ని తరలించగలం తప్ప.. అన్యధా సభను విజయవంతం చేయలేమని వారు తేల్చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ వద్ద ఉండే నిధులను వెచ్చించడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా సభ నిర్వహించాలనే ఆలోచనకు తిలోదకాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రజలలో తమకు ఆదరణ ఉన్నదని తర్వాత అయినా నిరూపించుకోవచ్చు.. ఉన్నా లేకపోయినా ఉన్నదని తాము టముకు వేసుకుంటూ ఉండవచ్చు.. అంతే తప్ప అందుకోసం నిల్వ ఉన్న నిధులను ఖర్చు పెట్టడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. అందుకే 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడానికి బదులుగా అత్యంత సింపుల్ గా ముగించేసినట్లుగా చెబుతున్నారు.