పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించే విషయంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన వంచనకు పాల్పడితే.. చంద్రబాబు నాయుడు దానిని సరిదిద్దడానికి కృతనిశ్చయంతోనే తన ఎన్నికల హామీని ప్రకటించారు. ఒక ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ లెక్కవేసి, ఒక్కొక్కరికి 15 వేల వంతున అందిస్తామని.. జగన్ పెట్టినట్టుగా ఆ సొమ్ములో కూడా కోతలు లేకుండా పూర్తి మొత్తం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి నెలలు కూడా గడవక ముందే.. జగన్ మోహన్ రెడ్డి దీని గురించి యాగీ చేయడం ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ అనే పథకం ఇంకా ప్రారంభించలేదు చంద్రబాబు మోసం చేస్తున్నారు అంటూ.. జగన్ చాలా గోల చేశారు. అయితే ఇప్పుడు ఆ పథకం విషయంలో జగన్ నోటికి తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది!
‘తల్లికి వందనం’ విషయంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. గత జూన్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ ఏడాదిలోనే అమలు ప్రారంభించలేదు అని.. జగన్ నానా గోల చేశారు. కానీ ఈగోలను ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే.. 2019కి పూర్వం అమ్మఒడి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చినతర్వాత ఆ విద్యాసంవత్సరంలో అమలు చేయలేదు. ఆ తర్వాతి సంవత్సరం నుంచే అమలు చేశారు. అందువల్ల ఆయన విమర్శలకు విలువ లేకుండాపోయింది.
అదే సమయంలో అమ్మ ఒడి ముసుగులో చేస్తానన్న సాయం చేయకుండా.. జగన్ చేసిన వంచన కూడా ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. ఆయన ఇంటికి ఒక పిల్లవాడికి మాత్రమే లెక్కలేసి అమలు చేశారు. అయితే చంద్రబాబునాయుడు ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ వర్తింపజేస్తున్నారు. ఈ ఏడాది మే నెల నుంచి తల్లికి వందనం అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించడం ద్వారానే చంద్రబాబునాయుడు జగన్ నోటికి తాళాలు వేశారు. అదే సమయంలో తాజా గణాంకాలను గమనిస్తే.. జగన్ ఇన్నాళ్లూ అన్యాయం చేశారని ప్రజలు గుర్తించే పరిస్థితి!
చంద్రబాబు సర్కారు.. రాబోయే విద్యాసంవత్సరానికి తల్లికి వందనం కోసం 9407 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 78 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం జమానాలో కేవలం 48 లక్షల మందికి మాత్రమే ఈ సాయం అందేది. అంటే అప్పట్లో ఎంత మంది అర్హులను జగన్మోహన్ రెడ్డి వంచించారో.. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు కాబోతోంది. సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా బాబు సర్కారు వేస్తున్న అడుగులు చూస్తోంటే.. జగన్ ముందు ముందు నోరెత్తడానికి కూడా ఏమీ మిగలదని ప్రజలు అంటున్నారు.