జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఎగబడిన వారిలో విజయసాయిరెడ్డి కూడా ఒకరు. ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి ఆయనను ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జిగా విశాఖపట్నం కేంద్రంగా అధికారం చలాయించడానికి నియమించారో గాని.. విశాఖపట్నం మొత్తం తాను దోచుకోవడానికి ఏర్పడిన అడ్డా అని ఫిక్స్ అయినట్లుగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. దానికి తోడు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని జగన్ ప్రకటన చేసిన తర్వాత ఆ నగరాన్ని దోచుకోవడం మీద విజయసాయి మరింతగా కసరత్తు చేశారని కూడా ప్రజలకు తెలుసు. అలా విచ్చలవిడిగా సాగించిన దోపిడీ పర్వాలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చరమగీతం పాడుతున్నారు. తన అల్లుడి సోదరుడి పేరుతో కాకినాడ పోర్టులో వాటాలను బెదిరింపులతో బలవంతంగా చేజిక్కించుకున్న వ్యవహారం పోలీస్ కేసుగా మారడంతో విజయసాయి దళాలు ఎలా వెనక్కు తగ్గి వాటాలను తిరిగి అప్పజెప్పేశాయో అందరికీ తెలుసు. అదే తరహాలో విశాఖపట్టణం పరిధిలో సాగించిన భూదందాలు, భూ అక్రమాల విషయంలో కూడా ఆయనకు ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతోంది. విజయసాయి అండ చూసుకుని చెలరేగిన ఆయన కూతురు కంపెనీలకు సాక్షాత్తు హైకోర్టు మొట్టికాయ వేస్తుండడం గమ గమనార్హం!
విశాఖపట్నంలో భీమిలి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతి సమీపంలోనే కాంక్రీట్ గోడలను నిర్మించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి కూతురు నేహా రెడ్డికి చెందిన కంపెనీ నే ఇలాంటి తప్పుడు నిర్మాణాలను చేపట్టినట్టుగా అధికారులు గుర్తించారు. కూల్చివేతలు కూడా చేపట్టారు. అయితే ఈ కూల్చివేతల విషయంలో పూర్తిస్థాయిలో చేయకుండా సగం సగం చేసి వదిలినందుకు అధికారుల మీదనే హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే నేహా రెడ్డి భాగస్వామిగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ నీ మీద క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని కూడా పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అంతే కాదు.. ఈ కాంక్రీటు గోడల కూల్చవేతకు అయ్యే ఖర్చుమొత్తాన్ని నేహారెడ్డికి చెందిన కంపెనీల నుంచే వసూలు చేయాలని కూడా హైకోర్టు విస్పష్టంగా ఆదేశించింది.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఆయన అనుచర గణాలు అందరూ భూములను కబ్జా చేస్తూ పోగా.. తాను సముద్రాన్ని కూడా కబ్జా చేసేస్తాను అన్నట్లుగా హద్దులను దాటి సముద్రతీర ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ విజయసాయిరెడ్డి కూతురుకు చెందిన సంస్థ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం తీవ్రమైన విషయం! హైకోర్టు ఇదే అంశాన్ని ప్రస్తావించింది. గోడలను పాక్షికంగా కాకుండా పూర్తిగా ఆరు అడుగుల పునాదులతో సహా మొత్తం 588 మీటర్ల పొడవునా కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇది వారికి అతి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.
విజయ్ సాయి రెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. జగన్మోహన్ రెడ్డి నీడలో ఉండడం వలన భవిష్యత్తులో ఎదగడం కాదు కదా.. జీవితం మొత్తం మరింత చిక్కుల్లోకి జారుకుంటుందని ఆయన ముందుగానే గ్రహించారు. అయినప్పటికీ బిడ్డ చచ్చినా పురిటి వాసన పోదు అన్న సామెత చందంగా ఆయన అరాచక పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ తో తన అనుబంధాన్ని తెంచుకున్నప్పటికీ, ఆ రోజులలో చేసిన అక్రమాలు పాపాలకు సంబంధించిన నేరాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. దీనికి తాజాగా హైకోర్టు మార్గదర్శకాలు ఉదాహరణ అని ప్రజలు భావిస్తున్నారు.