బాబు మాటలు వక్రీకరిస్తే ప్రజలు హర్షిస్తారా జగన్?!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం అన్నారో ప్రజలందరికీ తెలుసు. ఇవేమీ మాటలను మాయ చేసి దుష్ప్రచారం చేయడానికి అనుకూలమైన పాత రోజులు కావు. నాయకులు మరీ అంతరంగిక సంభాషణల్లో ,తప్ప మాట్లాడే ప్రతి మాట కూడా ఆన్ రికార్డ్ లభ్యమవుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు దొంగచాటుగా ఏమి వ్యాఖ్యానించలేదు. తన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో బహిరంగం గానే చెప్పారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు పనులు చేయవద్దు’ అని తమ పార్టీ ప్రజా ప్రతినిధులను ఆయన హెచ్చరించారు. అలా చేయడం పాముకు పాలు పోసినట్లే అవుతుందని ఆయన జాగ్రత్తలు చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు మాటలను వక్రీకరించి తద్వారా ప్రజలలో ఆయన పట్ల ద్వేషభావం పాదుగొల్పడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా సంక్షేమ పథకాల ప్రస్తావన తేలేదు. ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో పథకాలు పొందిన వారందరూ కూడా ఇప్పుడు లబ్ధిదారులు గానే ఉన్నారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రలోభ పెట్టడానికి, వక్రమార్గాలకు అలవాటు పడినవారు కాబట్టి- వారు తెలుగుదేశానికి చెందిన ప్రజాప్రతినిధులను లొంగదీసుకుని, అడ్డదారుల్లో కాంట్రాక్టులు దక్కించుకోకుండా,  వారి దళారీ పనులను తెలుగుదేశం నాయకుల ద్వారా చక్కబెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే చంద్రబాబు నాయుడు చెప్పారు. వైసిపి నాయకులకు పనులు చేయడం అనేది పాముకు పాలు పోసినట్లేనని చంద్రబాబు చాలా స్పష్టంగా పేర్కొనడాన్ని గమనించాలి. పాముకు పాలు పోసి పెంచినా సరే అది ఏదో ఒక నాటికి కాటు వేసి తీరుతుందనే నమ్మకాన్ని ఆయన ఇక్కడ ధ్వనింపజేశారు. వైసీపీ నాయకులకు పనులు చేసినా కూడా వారి ప్రలోభాలకు లొంగినట్లయితే వారు ఏదో ఒక నాటికి మనకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారు అనేది చంద్రబాబు హెచ్చరిక లోని ఆంతర్యం. తమ పార్టీ నాయకుల కుట్రలకు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు లొంగకుండా చంద్రబాబు చేసిన హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డికి కంటగింపుగా మారినట్లుంది.

ఆయన ఆ మాటలను వక్రీకరించి లబ్ధి పొందాలని జగన్ అనుకుంటున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ పచ్చిగా బాబు వ్యాఖ్యలను వక్రీకరించి తన దిగజారుడుతనాన్ని నిరూపించుకుంటున్నారు. వైసీపీ వాళ్లకు పథకాలు ఇవ్వద్దని చంద్రబాబు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక అసత్య ప్రచారంతో చెలరేగుతున్నారు. ప్రజలు ఒక్కో సందర్భంలో ఒక్కో భావజాలంతో ఓట్లు వేయవచ్చు గాక! అంతమాత్రాన జగన్ కు అనుకూలంగా ఓటు వేసిన వాళ్లు వైసిపి వాళ్లు గా ముద్రపడడానికి అవకాశం లేదు. ప్రజల మనోగతం మారుతూ ఉంటుంది గనుకనే ప్రభుత్వాలు కూడా మారుతూ ఉంటాయి. వైసిపి నాయకులుగా చలామణి అయ్యేవారు పాము లాంటి కుట్రపూరిత వ్యక్తులై ఉంటారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తే.. వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఆపేయాలని చంద్రబాబు చెబుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక దుష్ప్రచారానికి పూనుకోవడం ఆయన చవకబారుతనానికి నిదర్శనం.. అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబును వేరే విమర్శించడానికి అవకాశం లేక, మార్గాలు తోచక ఇలాంటి కుట్రపూరిత వ్యాఖ్యలతో తమ కురచ బుద్ధిని నిరూపించుకుంటున్నారని అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories