జనసేన సభ.. సరికొత్త ట్రెండ్ అవుతుందా?

ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం వింతేమీ కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఇలాంటి సభలు తప్పకుండా జరుగుతాయి. అధికారంలో ఉన్నప్పుడు.. తమ ప్రాభవాన్ని, తమకు దక్కిన ప్రజాదరణను ప్రదర్శించుకోవడానికి  ఇంకా తప్పకుండా సభలు నిర్వహిస్తాయి. అయితే ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా ప్రస్తుతం ఏపీలో అదికారంలో ఉన్న జనసేన, ఈ నెల 14న తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం ద్వారా.. ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించబోతున్నదా అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.

పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్ ను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తదితరులు కాకినాడలో ఆవిష్కరించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఆవిర్భావ సభ జరగబోతోంది. అయితే జనసేన పార్టీ ఈ సభను దాదాపుగా పార్టీకోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అంకితం చేయబోతున్నది. తమ పార్టీ ఘనతలను చాటుకోకవడం కంటె.. ఒక్కరోజు మాత్రమే జరిగే ఈ సభను కార్యకర్తలను సత్కరించడానికే ఎక్కువగా వాడబోతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పోస్టర్ ఆవిష్కరణ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. కష్టపడి జెండా మోసి.. జనసేన, పవన్ కల్యాణ్ విజయానికి కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వడానికే ఈ ఆవిర్భావ సభను పండగలాగా నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. సభా నిర్వహణకు 254 మందితో 14 కమిటీలు వేశారు.
జనసేన పార్టీ ప్రస్తుతం కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే సీట్లలో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కి కేడర్ ఉంది.

ఆపార్టీ ఇప్పుడున్న వైభవ స్థితికి పునాదులు వేసిన వారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్నారు. 2014 ఎన్నికలకు పూర్తమే పవన్ కల్యాణ్ పార్టీని ప్రకటించగా.. 2019 వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేయకపోయినప్పటికీ, 2019 ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ.. పార్టీని సజీవంగా ఉంచడంలో.. పవన్ అభిమానులైన పార్టీ కార్యకర్తల పాత్ర ఎంతో ఉంది. అంకిత భావం గల అలాంటి కార్యకర్తల కారణంగానే పార్టీ మనుగడ స్థిరంగా, ఉన్నతంగా సాగుతోంది. ఎమ్మెల్యే పదవులు, నామినేటెడ్ పదవులు అనేవి కొంతమందికి మాత్రమే దక్కే అవకాశాలు కాబట్టి.. పార్టీ  కోసం కష్టపడిన అందరినీ సత్కరించుకోవడానికి ఈ ఆవిర్భావ సభను వేదికగా వాడుకోబోతున్నారు. జెండామోసే అభిమానులు, సామాన్య కార్యకర్తలకు కూడా సముచిత గౌరవం కల్పించడంలో ఈ రకంగా జనసేన ఒక కొత్త ట్రెండ్ తీసుకురానున్నదని అనిపిస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories