కొన్ని దశాబ్దాలుగా ఆయన న్యాయపరమైన కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగానూ బోలెడు కేసులను కోర్టుల్లో చూశారు. అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కూడా అనేక కేసులు పడుతున్నాయి. నిమిషానికి లక్షల రూపాయల వంతున ఫీజులు పుచ్చుకునే కొమ్ములు తిరిగిన సీనియర్ న్యాయవాదుల్ని నియమించుకుని.. దావాలు నడుపుతుంటారని అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.
అయినా సరే.. సరస్వతీ పవర్ సంస్థ షేర్ల విషయంలో బేసిక్ లాజిక్ మిస్సవుతూ జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ కేసు ఎలా వేశారనేది చాలా మందికి ఆశ్చర్యకరం. కన్నతల్లికి ఇచ్చిన కంపెనీ షేర్లను తిరిగి తన పేరుతో బదిలీ చేయాలంటూ ట్రిబ్యునల్ కు వెళ్లడమే పెద్ద పరువు తక్కువ వ్యవహారం కాగా.. న్యాయపరంగా కూడా చెల్లుబాటు కాని అవకతవక కేసుగా అది ఇప్పుడు వార్తల్లోకి వస్తోంది. జగన్ మరియు భారతి కుట్రపూరితంగా ఈ కేసు ట్రిబ్యునల్ లో వేసినట్టుగా ఆయన తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా కోర్టుకు సమర్పించిన తన కౌంటర్లో పేర్కొన్నారు.
తల్లికి బదిలీ చేసిన షేర్లు గిఫ్ట్ డీడ్ కింద జగన్ మరియు భారతి అప్పజెప్పారు. సదరు గిఫ్ట్ డీడ్ లో ఎక్కడా షర్మిల పేరు ప్రస్తావన కూడా లేదని ఇప్పుడు విజయమ్మ చెబుతున్నారు. అయితే జగన్ ట్రిబ్యునల్ లో వేసిన కేసు మాత్రం.. షర్మిల భవిష్యత్తు కోసమే తల్లి విజయమ్మకు షేర్లు ఇచ్చామని, ఇప్పుడు అవి తిరిగి వెనక్కు కావాలని అడుగుతున్నారు. కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా అసలు కంపెనీ చట్టం కింద జగన్, భారతి వేసిన పిటిషన్లే చెల్లవంటూ ఆమె ట్రిబ్యునల్ తన కౌంటర్లో తెలియజెప్పారు. ఇదంతా కూడా ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టించడానికే చేసినట్టుగా ఆమె చెబుతున్నారు.
ఇంత సింపుల్ లాజిక్ జగన్ ఎలా మిస్సయ్యారు. కోర్టు వ్యవహారాల్లో అంత అనుభవం ఉన్న ఆయన పొరబాటుగా అలా పిటిషన్ వేశారా? అంటే కాదని కావాలనే వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల తన మీద కక్ష కట్టినట్టుగా ప్రొజెక్టు చేసి సానుభూతి సంపాదించుకోవడానికే జగన్ ఇలాంటి ప్రయత్నం చేసినట్టుగా అనుకుంటున్నారు. షర్మిల కోసం సరస్వతి పవర్ ను ధారాదత్తం చేసినట్టుగా బిల్డప్ ఇస్తే.. తనకు మైలేజీ వస్తుందని, షర్మిల తన రాజకీయ ప్రత్యర్థులతో కలిసి నడిపిస్తున్నట్టుగా ప్రచారం చేయవచ్చునని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే వైఎస్ విజయమ్మ మాత్రం.. చాలా కరాఖండీగా కౌంటర్లో వివరాలు చెప్పారు. సరస్వతీ పవర్ లో 99.75 శాతం షేర్లు తనవేనని… వాటిని ఎవరూ ప్రశ్నించజాలరని ఆమె అంటున్నారు. షర్మిల పేరు ఈ వివాదంలోకి లాగడమే జగన్, భారతిల కుట్ర అని కూడా అంటున్నారు. మరి ఈ ఆరోపణల్ని జగన్ ఎలా ఎదుర్కోగలరో చూడాలి.