కూటమిప్రభుత్వాన్ని బద్నాం చేయడం, వారి మీద బురద చల్లడం మాత్రమే వారి లక్ష్యం. అందులో వారికి ఎలాంటి విచక్షణ ఉంండాలనే నియమం లేదు. తప్పు జరిగితే ఎత్తి చూపించాలనుకోవడం వారి ఉద్దేశ్యం కాదు.. ఒక పని జరుగుతున్నదంటే.. అందులో తప్పే జరుగుతోంది అని ప్రచారం చేయడం ఒక్కటే వారి ఆలోచన. అలాంటి అతి వేషాలు వేసినందుకు ఇప్పుడు సభాహక్కుల కమిటీ విచారణను ఎదుర్కొనే పరస్థితి ఏర్పడుతోంది. సాక్షి దినపత్రికలో ప్రచురించిన ఒక అనుచిత కథనంపై సభాహక్కుల కమిటీకి రిఫర్ చేస్తున్నట్టు స్పీకరు అయ్యన్నపాత్రుడు సభలో ప్రకటించారు. కమిటీ నిర్ణయాన్ని బట్టి.. సాక్షి పత్రిక మీద దండనకు సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంతకూ ఏం జరిగిందంటే.. శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కొత్త సభ్యుల కోసం శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. సాధారణంగా ఇది ప్రతిసారీ జరుగుతూనే ఉంటుంది. సభ ఏర్పడినప్పుడు.. కొత్త సభ్యులకు సభా నియమాలు, నిబంధనలు తెలియవు గనుక.. వారికి శిక్షణ ఏర్పాటుచేస్తారు. అదే పని ఈ సారి కూడా ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో నిర్వహించేలా అనుకున్నారు. ఈ కార్యక్రమాలకు లోక్ సభ స్పీకరు ఓంబిర్లాను, రాజ్యసభకు గతంలో ఛైర్మన్ గా చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా ఆహ్వానించారు. ఏర్పాట్లు అన్నీ పూర్తయిన తరుణంలో.. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున.. ఈ శిక్షణను వాయిదా వేసుకున్నారు. ఈలోగానే సాక్షి దినపత్రిక అత్యుత్సాహం ప్రదర్శించింది. ఈనెల 22 వ తేదీన.. ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు’ అనే శీర్షికతో ఒక కథనం ప్రచురించింది.
నిజానికి 22, 23 తేదీల్లో నిర్వహించాలని ప్లాన్ చేశారంతే. 22నాటికి ఆ శిక్షణ కార్యక్రమం వాయిదా పడిపోయింది కూడా. అంటే జరగనేలేదు. కానీ అదే రోజున కోట్లు ఖర్చు పెట్టేసినట్టుగా.. శిక్షణ నిరుపయోగమైందన్నట్టుగా సాక్షి కథనం ప్రచురించడం జరిగింది. ఈ విషయాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య శాసనసభలో ప్రస్తావించారు. దాంతో స్పీకరు సాక్షి కథనాన్ని సభాహక్కుల కమిటీకి రెఫర్ చేశారు.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఈ శిక్షణకు హాజరయ్యేందుకు లోక్ సభ స్పీకరు తన సొంత డబ్బులతో విమానం టికెట్ కొన్నారని, అలా కార్యక్రమం నిర్వహిస్తోంటే.. అసలు శిక్షణ కూడాజరగకముందే.. కోట్లు తినేసి శిక్షణ వేస్టయిందన్నట్టుగా కథనాలు ప్రచురించడం తగదని అన్నారు. తొలుత- సంస్కారం లేని వారు ఏదో రాస్తే ఏమైందిలే అని వదిలేశానని, కానీ… ఇలాంటి తప్పు కథనాలపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి సాక్షి ప్రదర్శించిన అత్యుత్సాహానికి ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వచ్చేలా ఉంది.