పురోగతిని వినలేకనే జగన్ అండ్ కో పలాయనం!

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నాలుగు మంచి మాటలు వినవస్తోంటే.. వాళ్లందరికీ బహుశా చెవుల్లో సూదులు గుచ్చుతున్న శిక్షలాగా అనిపించి ఉండవచ్చు. పరిశ్రమలు వస్తున్నాయని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాకారం అవుతోందని చెబుతున్న మాటలను వారు కర్ణకఠోరంగా భావించి ఉండవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నరు అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్క క్షణమైనా వినలేకపోయారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి.. గవర్నరు ప్రసంగం ప్రారంభించిన క్షణంనుంచి.. పెద్దపెట్టున గోలచేస్తూ అరచి యాగీ చేసిన వైసీపీ సభ్యులు.. కేవలం పదే నిమిషాలు గడిచేలోగా.. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో లేచి బయటకు వెళ్లిపోయారు.

గవర్నరు అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన పురోగతిని అంశాల వారీగా వివరించారు. అలాగే అంతకుముందు 2019నుంచి అయిదేళ్ల పాటూ ఉన్న ప్రభుత్వ పరిపాలన కాలంలో.. జరిగిన విధ్వంసాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.  గత అయిదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనుకబాటుకు గురైందని, నష్టపోయిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం వంటి పనుల ద్వారా.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. పేదలకు స్కాలర్ షిప్ ల దగ్గరినుంచి, ప్రతినెలా ఇళ్లవద్దనే అందిస్తున్న పింఛన్ల వరకు అన్నింటినీ ప్రస్తావించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు నజీర్ వెల్లడించారు. ఈ ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోగా అర్హులైన ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ప్రకటించారు. పోలవరం, అమరావతి పనులను తిరిగి గాడిలోకి తీసుకువచ్చిన వైనం కూడా గవర్నరు చెప్పుకొచ్చారు.

పారిశ్రామికంగా రాష్ట్రం పురోగమనం దిశగా ఈ అయిదేళ్లలో పడిన అడుగులను కూడా వెల్లడించారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టాటా పవర్, గ్రీన్ కోగ్రూప్ బీపీసీఎల్, టీసీఎస్ కంపెనీలు రాబోతున్న వైనం వెల్లడించారు. ఐటీ విప్లవానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. అయితే జగన్ సర్కారు పాలన సాగిన అయిదేళ్లలో పారిశ్రామికంగా రాష్ట్రం ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనే సంగతి తెలిసిందే. అభివృద్ధి పరంగా రాష్ట్రం నాశనమైన సంగతి అందరికంటె బాగా జగన్ అండ్ కో కే బాగా తెలుసు. గవర్నరు ఇవన్నీ చెబుతూ ఉండగా.. ఆ మాటలు వినడమే ఇష్టం లేదన్నట్టుగా.. గవర్నరు ప్రసంగం ఇతరులకు కూడా వినిపించకూడదన్నంత గట్టిగా.. వైసీపీ సభ్యులు నినాదాలతో అల్లరి చేశారు. తమకు ప్రజలు అర్హత ఇవ్వలేదనే సంగతి తెరలిసినా.. ప్రతిపక్ష హోదా పేరుతో యాగీ చేశారు. పదే నిమిషాల వ్యవధిలో సభ నుంచి పలాయనం చిత్గగించారు. జగన్ అసెంబ్లీ బయటకూడా ఎవ్వరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోగా.. మీడియా పాయింట్ వద్ద బొత్స మరికొందరు నాయకులు.. తమ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్ ను మళ్లీ వినిపించడం గమనార్హం. 

Related Posts

Comments

spot_img

Recent Stories