మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో భూస్వామ్య, పెత్తందారీ, పాలెగాళ్ల పోకడలు ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. ఆయన చాలా తరచుగా తనలోని అలాంటి అహంకార వైఖరిని, ఎదుటివాళ్లను చులకనగా చూసే వైఖరిని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా వంశీ అరెస్టు తర్వాతి పరిణామాల్లో ఆయన స్పందన, వైఖరి కూడా అలాగే కనిపిస్తున్నాయి. జైల్లో ఉన్న వంశీని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. అనంతరం ప్రెస్ తో మాట్లాడుతూ.. పోలీసుల మీద విరుచుకుపడడం గమనార్హం. ఇప్పుడంటే అధికారం తన చేతిలో లేదు గనుక.. పోలీసులు కూటమి నాయకుల మాట వింటున్నారనే భ్రమలో జగన్ విరుచుకుపడుతుండవచ్చు. కానీ, తన పాలన కాలంలో కూడా ఆయన పోలీసులను బానిసల్లాగానే చూశారనే విమర్శలు ఇప్పుడు వినవస్తున్నాయి.
పోలీసు యంత్రాంగం కేసులు నమోదు అయిన తీరును బట్టి.. నడుచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి ఆధారాలు, నిర్దిష్ట సాక్ష్యాలు లేకపోయినా.. చంద్రబాబునాయుడును జగన్ ఎలా అరెస్టు చేయించారో.. రాష్ట్రప్రజలందరికీ తెలుసు. పోలీసులను తన ఇంటి బానిసల్లా వాడుకుంటూ.. చేయించిన అలాంటి దుర్మార్గమే జగన్ పతనాన్ని శాసించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి దుర్మార్గపు అరెస్టు ఒక్కటి కూడా జరగనేలేదు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీద దాడిచేయించిన కేసులో వల్లభనేని వంశీ పేరు ఎప్పటినుంచో వినిపిస్తున్నప్పటికీ.. ఆయన అరెస్టు జరగలేదు. ఇప్పుడు కూడా.. వంశీ ఓవరాక్షన్ చేసి.. ఫిర్యాదుచేసిన వ్యక్తిని కిడ్నాపు చేయడం, అతనితో తప్పుడు వాంగ్మూలం ఇప్పించడం వల్ల మాత్రమే జరిగింది తప్ప.. దాడి కేసులో కాదు. చేసే కిడ్నాపు చేసేసి, అది బయటపడగానే.. ప్రభుత్వం మీద పడి ఆడిపోసుకోవడం, పోలీసుల్ని బెదిరించడం జగన్ అలవాటుగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది.
తప్పు చేసిన వారిని రిటైరైనా సరే వదలిపెట్టం అని జగన్ అంటున్నారు. ఇంతకూ ఆయన దృష్టిలో తప్పు అంటే ఏమిటి? కేసుల ప్రకారం చట్టం ప్రకారం నడుచుకోవడం మాత్రమే తప్పు అనుకుంటున్నారా? కేసులు నమోదుకాకుండానే చూసుకోవాలి.. అలాంటి తప్పులు వైసీపీ నేతలు చేయకుండా చూసుకోవాలి కదా అనేది ప్రజల సందేహం. సప్తసముద్రాల ఆవల ఉన్నా కూడా వెతికి పట్టుకొస్తారట… బట్టలూడదీసి నిలబెడతారట.. పోలీసులను జగన్ ఈ తరహాలో బెదిరిస్తున్నారు.
పోలీసులను బానిసల్లా చూసే జగన్ సంస్కృతికి ఈ మాటలు వింత కాదు అని ప్రజలంటున్నారు. ఎందుకంటే.. ఆయన తన పరిపాలన కాలంలో.. ఉద్యోగుల ఆందోళనను ముందే పసిగట్టి అణచివేయలేకపోయినందుకు.. ఏకంగా డీజీపీ మీద తీవ్రంగా కోప్పడి ఆ పదవినుంచి తప్పించారు. అలాగే, తను కోరుకున్నట్టుగా తన రాజకీయ ప్రత్యర్థుల్ని హింసిచడం లేదని అలిగి సీఐడీ చీఫ్ పదవినుంచి సునీల్ కుమార్ ను తప్పించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. పోలీసులక గురించి మర్యాదగ మాట్లాడతారని ఆశించడం భ్రమ అని ప్రజలు భావిస్తున్నారు.