ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్ వాడీలకు చంద్రబాబునాయుడు ఒక గొప్ప శుభవార్త ప్రకటించారు. ప్రభుత్వోద్యోగులుగా ఏ సదుపాయం కోసమైతే వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో పోరాటాలు సాగించారో, జగన్ ప్రభుత్వపు దుర్మార్గపు వైఖరి వలన అణచివేతలకు గురయ్యారో.. ఆ కోరికను చంద్రబాబు సర్కారు కేవలం 8 నెలల్లోనే నెరవేర్చింది. రాష్ట్రంలో అంగన్ వాడీలుగా పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు పదవీవిరమణ సమయంలో గ్రాట్యుటీ ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇది పొరుగురాష్ట్రం తెలంగాణలో కూడా అందుబాటులో లేని సదుపాయం కావడం గమనార్హం.
అంగన్ వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వడం గురించి గతంలో గుజరాత్ రాష్ట్రంలో ఓ కేసు నమోదు అయింది. సుప్రీం కోర్టు వారికి గ్రాట్యుటీ ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా గ్రాట్యుటీ విధానం తీసుకువచ్చింది. దేశంలో మరెక్కడా కూడా అంగన్ వాడీలకు ఇలా ఇవ్వడం లేదు. ఏపీకి సంబంధించినంత వరకు రిటైర్ అయినప్పుడు అంగన్ వాడీ కార్యకర్తలకు రూ.లక్ష, ఆయాలకు రూ.40వేలు ఏకమొత్తంగా ఇస్తున్నారు. అయితే తమకు గ్రాట్యుటీరూపంలో సర్వీసు సంవత్సరాలను బట్టి కావాలని వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో.. అంగన్ వాడీలు రోడ్డెక్కి ఏకంగా యాభై రోజుల పాటు ధర్నాలు చేసినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా వారి పోరాటాల్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. గ్ర్రాట్యుటీ ని కేంద్రంతో ముడిపెడుతూ బుకాయిస్తూ వచ్చింది. దీంతో వారికి గ్రాట్యుటీ ఇస్తామంటూ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటించారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత.. దీనికి సంబంధించిన జీవో వస్తుందని చెబుతున్నారు. దీనివల్ల ఏడాదికి పదికోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుందని అనుకుంటున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు లక్ష మంది అంగన్ వాడీ కార్యకర్తలకు, ఆయాలకు లబ్ధి చేకూరుతుంది.
ఎన్నికలకు ముందు అంగన్ వాడీల పదవీకాలాన్ని కూడా 62 ఏళ్లకు పెంచారు. అందువల్ల 2026 జనవరి వరకు కొత్త రిటైర్మెంట్లు ఉండవు అని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత రిటైరయ్యే వారికి పెరిగిన గ్రాట్యుటీ లభిస్తుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా గ్రాట్యుటీవిధానం అమలులోకి తీసుకురావడానికి కేంద్రానికి లేఖ రాసినప్పటికీ.. రాష్ట్రప్రభుత్వం తరఫునే ఆచరణలోకి తీసుకురావడానికి పూనుకోవడం విశేషం.