వంశీ.. చేసిన పాపాలు ఊరకే పోతాయా?

నాయకులు అరెస్టు అయినప్పుడు.. వారి అనుచరులు, వందిమాగధులు రెచ్చిపోవడం మామూలే! కానీ ఆ అరెస్టు పట్ల సాధారణ ప్రజల్లో ఎలాంటి స్పందన ఉన్నదనేదానిని బట్టి ఆ నాయకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సాధారణ ప్రజల్లో కనీసంగానైనా జాలి పుడితే.. నాయకుడికి రాజకీయ జీవితం ఇంకా మిగిలి ఉన్నట్టు లెక్క! అది కూడా లేనప్పుడు.. రాజకీయజీవితం చరమాంకానికి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి.  

ఈ సిద్ధాంతానికి- జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన చంద్రబాబునాయుడు అరెస్టు- ఇప్పుడు జరిగిన వల్లభనేని వంశీ అరెస్టు రెండు చక్కటి ఉదాహరణలు! జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. కనీస విచక్షణ లేకుండా అడ్డగోలుగా చెలరేగిన వల్లభనేని వంశీ ఇప్పుడు వివిధ కేసుల్లో అరెస్టు అయ్యారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆయన మీద నమోదు అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు..! కానీ ఆయన అరెస్టు పట్ల ప్రజల్లో, కనీసం ఆయన నియోజకవర్గం వారిలో కూడా కనీస మాత్రంగా జాలి వ్యక్తం కాకపోవడం మరో ఎత్తు! వంశీ నియోజకవర్గ ప్రజలు కూడా.. చేసిన పాపాలు ఊరకే పోతాయా? అని వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

గన్నవరం తెలుగుదేశం కార్యాలయం పై జరిగిన దాడి, విధ్వంసం, వాహనాల దహనం వంటి వాటికి సంబంధించి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదై ఉంది. చాలాకాలంగా ఆయనను విచారిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో వంశీ కాస్త అతి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే యువకుడు అక్కడ ఉన్న సమయంలోనే దాడి జరగడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వల్లభనేని వంశీ అతి తెలివితో స్కెచ్ వేసి.. సత్యవర్ధన్ తో కేసు విత్ డ్రా చేయించుకోవడానికి బెదిరింపులకు పాల్పడ్డారు.

అతను కొన్నాళ్లు హైదరాబాదులో తలదాచుకుని తిరిగివచ్చిన తర్వాత.. అతడిని కిడ్నాప్ చేశారు. వంశీ అనుచరులు అతడిని కోర్టుకు తీసుకువెళ్లి.. తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టుగా సత్యవర్దన్ అన్న కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు దాడి కేసు పక్కకు పోయి.. వంశీ, అతని అనుచరుల  మీద కొత్త కేసులు తెరపైకి వచ్చాయి. అతి తెలివితే ప్లాన్ చేయడం బెడిసి కొట్టింది. కిడ్నాప్, దాడి, ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. వంశీని ఏపీ పోలీసులు హైదరాబాదులో తెల్లవారుజామున అరెస్టు చేశారు. మరొక పోలీసు బృందం పరారీలో ఉన్న ఆయన అనుచరులను విశాఖపట్నంలో అరెస్టు చేసింది. వంశీకి న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. ఆయనను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మొత్తానికి చేసిన పాపాలు ఊరకే పోవని.. వంశీ విచ్చలవిడిగా చెలరేగిన ఫలితమే ఇప్పుడు జైలు పాలయ్యారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఆఫీసుల మీద దాడి కేసులు మాత్రమే ఉండి ఉంటే ఆ విచారణ తీరు మరొక తరహాలో ఉండేది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసులే ఇంకా.. ఒక కొలిక్కి రావడం లేదు. సుదీర్ఘంగా విచారిస్తున్నారు తప్ప.. అరెస్టులు తక్కువగా జరిగాయి. బెయిళ్లు, ముందస్తు బెయిళ్లు కూడా వచ్చాయి. అయితే వంశీ అతి తెలివికి పోయి.. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి ప్రలోభ పెట్టి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించడం వంటి అతి వలన.. ఇప్పుడు పార్టీ ఆఫీసు మీద దాడి కేసుకంటె క్లిష్టమైన కేసుల్లో ఇరుక్కున్నారని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories