జగన్ అసమర్థత అప్పుడే అర్థమైందా శైలజా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు చాలా మంది ప్రజల దృష్టిలోంచి ఎన్నడో మరుగున పడిపోయారు గానీ.. సాకే శైలజానాధ్ పేరు బహుశా చాలా మందికి గుర్తుండవచ్చు. ఒకప్పటి ఈ మాజీ మంత్రి మొన్న మొన్నటిదాకా ఏపీసీసీకి సారథిగా కూడా వ్యవహరించారు గనుక.. ఆయన పేరు అందరికీ గుర్తుండే అవకాశం ఉంది.

పీసీసీ సారథ్యాన్ని వైఎస్ షర్మిల చేతిలో పెట్టడం పట్ల విముఖత ఉన్నదో లేదా, ఆ పార్టీ ఎటూ రాష్ట్రంలో నిలదొక్కుకోవడం కష్టమనే నమ్మకం ఉన్నదో తెలియదు గానీ.. మొత్తానికి సాకే శైలజానాధ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జాయిన్ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ అనేదే మునిగిపోతున్న నావ అని గ్రహించి.. ఆ పార్టీ నెంబర్ టూ మరియు జాతీయ ప్రధానకార్యదర్శితో సహా అందరూ నెమ్మదిగా తమ దారి తాము చూసుకుంటూ ఉండగా.. శైలజానాధ్ తగుదునమ్మా అంటూ వచ్చి ఆ పార్టీలో చేరడం అందరికీ చిత్రంగా కనిపించింది. ఒకవైపు పెద్దచేపలన్నీ పార్టీ నుంచి వెళ్లిపోతున్నప్పటికీ దళితనాయకుడిగా శైలజా వచ్చి చేరడాన్ని జగన్ చాలా ఘనంగానే డప్పుకొట్టుకున్నారు.

అయితే ఆ పార్టీలోకి ఎంటరైన రెండు మూడు రోజుల్లోనే.. పార్టీ సారథిగా జగన్మోహన్ రెడ్డి పనికిరారని, పార్టీకి నాయకత్వం వహించడం, ముందుకు తీసుకువెళ్లడం జగన్ కు చేతకాదని శైలజానాధ్ కు అర్థమైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా చురుగ్గానే వ్యవహరించగలుగుతున్న వైఎస్ విజయమ్మ వైసీపీ సారథ్యం స్వీకరించాలని శైలజానాధ్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు. ఈ మాటలను శైలజా ఏదో ప్రెవేటు సంభాషణల్లో తన మిత్ర నాయకులతో అనడం లేదు. ఏకంగా జగన్ కు వీరవిధేయులు అయిన ఆయన సామాజిక వర్గానికే చెందిన అనంత వెంకట్రామిరెడ్డి లాంటి నాయకులను పక్కన పెట్టుకుని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోనే చెబుతున్నారు.

శైలజానాధ్ తన మాటల్లో వైఎస్ జగన్ యొక్క కుటుంబంలోని తగాదాలను, ఆస్తుల వివాదాలను కూడా కెలుకుతూ ఉండడం విశేషం. అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తులకోసం జరుగుతున్న రచ్చ గురించి శైలాజా మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబం ఇలా బజార్న పడడం బాధ కలిగిస్తుందని, ఇది ఎక్కువ కాలం కొనసాగరాదని కోరుకుంటున్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆస్తుల వివాదాల పర్యవసానంగా జగన్మోహన్ రెడ్డి.. తన తల్లి విజయమ్మను కూడా చాలా కాలంగా దూరం పెట్టారు.

ఆమెకు రాసిచ్చిన వాటాలు కూడా వెనక్కు కావాలంటూ.. ఆయన ట్రిబ్యునల్ కేసు నడుపుతున్నారు. ఆస్తుల విషయంలో జగన్ అబద్ధాలు చెబుతూ.. వైఎస్ అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారంటూ.. విజయమ్మ వీడియో సందేశంలో జగన్ బుద్ధులను ఎండగట్టారు కూడా. ఇన్ని వ్యవహారాలు జరుగుతూ ఉండగా.. ఏకంగా విజయమ్మను వచ్చి.. వైసీపీ సారథ్యం స్వీకరించాలని శైలజానాధ్ కోరడం గమనిస్తే.. పార్టీలోకి వచ్చిన వెంటనే సారథ్యానికి జగన్ అనర్హుడు అని శైలజా గుర్తించారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories