వైవీ సైలెన్స్.. భూమనదే రాద్ధాంతం అంతా!

తిరుమలలో శ్రీవారి మహాప్రసాదం లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ విషయంలో డెయిరీ యజమానులు నలుగురిని సిట్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఎక్కువ ధరకు కొని, లేబుల్స్ మార్చి తక్కు ధరకు సరఫరా చేయడం వంటివాటితో పాటు, తమిళనాడులోని ఏఆర్ డెయిరీ పేరిట కాంట్రాక్టు ఉండగా.. భోలేబాబా డెయిరీ నుంచి తెప్పించిన నెయ్యిని సరఫరా చేయడం వంటి వాటి వరకు అనేక అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. అసలు ఏఆర్ డెయిరీ కి టెండరు దక్కడంలో కీలక భూమిక పోషించిన బోర్డు సభ్యుల పాత్ర గురించి కూడా ఆరా తీస్తున్నారు. అరెస్టులు త్వరలో జరుగుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వామి పట్ల జరిగిన ద్రోహాల బాగోతం వెలుగులోకి వస్తుండగా.. వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తమాషా ఏంటంటే.. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉన్న రోజుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తుండగా.. ఆయన మాత్రం సైలెన్స్ పాటిస్తున్నారు. గత ప్రభుత్వపు చివరి రోజుల్లో ఛైర్మన్ గా ఉండి ప్రభుత్వం మారాక దిగిపోయిన భూమన కరుణాకర రెడ్డి మాత్రం నానా హడావుడి చేస్తున్నారు.
నెయ్యి కల్తీ గురించి దర్యాప్తు అరెస్టుల దాకా వచ్చిన తర్వాత కూడా.. భూమన చెబుతున్న మాటలు చిత్రంగా ఉన్నాయి. టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టుగా సిట్ తేల్చిందే తప్ప.. నెయ్యి కల్తీ జరిగినట్టుగా ఎక్కడా చెప్పలేదని ఆయన అంటున్నారు. ఇంతా కలిపి వైవీసుబ్బారెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో కూడా ఇలాగే జరిగింది. అసలు ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. భూమన అతిగా ఆవేశపడిపోయి కొడుకుతో సహా తిరుమల వెళ్లి.. శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణాలు కూడా చేశారు. వైవీసుబ్బారెడ్డి మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు కూడా అరెస్టులు జరిగిన తర్వాత.. అసలు ఆరోపణలు వస్తున్న వ్యక్తి మౌనంగా ఉండగా భూమన రెచ్చిపోతున్నారు.

కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారితో కుదిరిన అక్రమ అడ్డదారి ఒప్పందాలు భూమన హయాంలో జరగలేదు గనుక.. ఆయన ధైర్యంగా సంకోచం లేకుండా మాట్లాడగలరనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనను మీడియా ముందుకు నెడుతున్నట్టుగా కనిపిస్తోంది. వైవీసుబ్బారెడ్డి మాట్లాడాల్సి వస్తే.. మీడియా వారి ప్రశ్నలకు దొరికిపోతారేమో అనే భయం ఆ పార్టీలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

భూమన చెబుతున్న చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. నెయ్యిలో కల్తీ జరిగే అవకాశమే లేదట. కల్తీ నెయ్యిని గుర్తిస్తే ట్యాంకర్లను తిప్పి పంపుతారట. తమ హయాంలో తిప్పి పంపిన ట్యాంకర్ల లెక్కలు చెబుతున్నారు. అంటే ఆ ట్యాంకర్లు మొత్తం కల్తీ నెయ్యి వచ్చినట్టే కదా! చివరికి, చంద్రబాబు, పవన్ లలో ఆలోచనల్లోనే కల్తీ ఉన్నదని భూమన ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి ఒకరు సైలెంట్ గా ఉండడమూ.. ఒకరు ఎక్కువగా మాట్లాడుతుండడమూ గమనిస్తే.. అసలు టీటీడీ ముసుగులో వైసీపీ నేతలు చేసిన పాపాలేమిటో తేలిపోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories