వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశలు వింటే ప్రజలు నవ్వుకుంటూ ఉంటారు. ప్రజలు విస్పష్టంగా ఆయనను కేవలం ఎమ్మెల్యేగా జీవించాలని తీర్పు చెబితే.. ఆయన ప్రభుత్వం మీద అలగడం.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప.. శాసన సభకు రాబోనని మారాం చేయడం జనానికి నవ్వు తెప్పించే వ్యవహారాలు. అయితే.. స్పీకరు ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఆయన చెబుతున్న మాటలు స్పీకరు అయ్యన్నపాత్రుడికి మాత్రం కోపం తెప్పిస్తున్నాయి. చట్టాలు, నిబంధనలు అన్నీ మార్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సభలో సమయం ఇవ్వాలా? అని స్పీకరు ప్రశ్నిస్తున్నారు. ఒక దఫా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కనీసం.. సభా నియమాలు కూడా తెలుసుకోకపోతే ఎలా అని అయ్యన్న అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డికి పాపం.. ప్రతిపక్ష నేత హోదా అనే పిచ్చి ఎందుకు పట్టుకున్నదో తెలియదు. ప్రతిపక్ష నేత అనే క్యాబినెట్ ర్యాంకును అనుభవించడం అనేది తన జీవితాశయం అన్నట్టుగా.. ఆయన పదేపదే ఆ విషయం చర్చకు తెస్తున్నారు. ప్రతిపక్ష హోదా కోసం ఆయన పడుతున్న ఆరాటం గమనిస్తే జీవితాంతం అదే చాలని ఆయన భావిస్తున్నట్టుగా ఉన్నదని జనం నవ్వుకుంటున్నారు.
నేను సభకు వెళ్లను.. వాళ్లను ఏం చేస్తారో చేసుకోమనండి.. సభకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ప్రెస్ మీట్ పెట్టి సమస్యలను ప్రస్తావిస్తా.. సభలో వారు సమాధానం చెప్పాలి.. అంటూ జగన్ కామెడీ చేస్తున్నారు. స్పీకరు అయ్యన్నపాత్రుడు కూడా ఇదే విషయాన్ని ఎద్దేవా చేస్తుండడం గమనార్హం.
తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి లోక్ సభ స్పీకరు ఓం బిర్లాను ఆహ్వానించడానికి అయ్యన్నపాత్రుడు ఢిల్లీ వచ్చారు. అక్కడ విలేకర్లతో మాట్లాడారు.
‘జగన్ ప్రతిపక్ష నేత కాదు. ఆ హోదాకు తగిన సంఖ్యాబలం వైకాపాకు లేదనేది జగమెరిగిన సత్యం. కానీ.. అది జగన్ కు తెలియకపోవడమే బాధాకరం’ అంటూ అయ్యన్న ఎద్దేవా చేశారు. చట్టాలు రూల్స్ తెలుసుకోవాలి.. వాటిని మార్చి ఆయనకు ముఖ్యమంత్రితో సమానంగా సభలో సమయం ఇవ్వాలంటే కుదరదు- అని స్పీకరు చెబుతున్నారు.
ఈ మాటలు విన్న జనం మాత్రం.. కొత్త ఎమ్మెల్యేలతో పాటు జగన్ ను కూడా శిక్షణ కార్యక్రమానికి పిలిచి.. రూల్సు గురించి చట్టాల గురించి.. శాసనసభలో పాటించాల్సిన మర్యాదలు, సాంప్రదాయాల గురించి అవగాహన కల్పించండి సార్.. అనుకుంటున్నారు. శాసనసభకు వెళ్లకుండా, బయట కూర్చుని ఇలా పదేపదే అదే మాట్లాడుతూ ఉండడం వల్ల జగన్ జనంలో మరింతగా పలుచన అవుతారని అంతా భావిస్తున్నారు.