మంత్రి పదవి కూడా నిర్వహించిన స్థాయిని మరిచి లేకి విమర్శలు చేయడం, లేకి భాషను వాడడం, నిందలు వేయడంలో కూడా దిగజారుడుతనం ప్రదర్శించడంలో నగరి వైయస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ముందు వరుసలోనే ఉంటారు. జగనన్న కళ్ళలో ఆనందం చూడడానికి ఆమె ఏమైనా చేస్తారు. ఎవరి మీద నైనా అర్థంపర్థం లేకుండా విరుచుకుపడతారు. జగన్ మీద ఈగ వాలనివ్వకుండా ఆమె ప్రత్యర్ధులను ఆడిపోసుకుంటూ గడుపుతారు. అలాంటి ఆర్కే రోజాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? వైసిపిలో చేరిన నాటి నుంచి అనేక ఉత్థాన పతనాలను చవిచూసిన రోజాకు జగన్ ఇప్పుడు ఎగ్జిట్ గేటు చూపిస్తున్నారా? అనే ప్రచారం నగరి నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఎంతో ప్రభావం చూపించిన ఒకప్పటి నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ ప్రకాష్ వైసీపీలో చేరబోతున్నారు.. అనే ప్రచారం రోజా అభిమానులను కలవరానికి గురిచేస్తుంది.
నగరి నియోజకవర్గానికి, అంతకుముందు పుత్తూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు వారసులుగా ఆయన కొడుకులు ఇద్దరూ తెలుగుదేశం టిక్కెట్ కోసం గట్టిగానే పోటీపడ్డారు. వీరిలో నిత్యం ప్రజల్లో ఉంటూ తండ్రి తరహాలో పేరు తెచ్చుకున్న గాలి భాను ప్రకాణష్ వైపు చంద్రబాబు మొగ్గారు. గత ఎన్నికల్లో భాను ప్రకాష్.. రోజాను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. అయితేు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో వేగిపోతున్న గాలి జగదీష్ ప్రకాష్.. ఇప్పుడు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
గాలి జగదీష్ ప్రకాష్ కేవలం ఎమ్మెల్యే పదవి మీద ఆశతోనే పార్టీ మారుతున్న సంగతి క్లియర్! తెలుగుదేశంతో తలపడి.. అన్నకు దక్కిన ఎమ్మెల్యే అవకాశాన్ని తాను దక్కించుకోవాలనేది కోరిక. అయితే జగదీష్ కు ప్రజల్లో అంతగా మంచి పేరు లేదని, గెలవడం కష్టం అనే ఉద్దేశంతోనే చంద్రబాబు అప్పట్టో భాను ప్రకాష్ ను ప్రోత్సహించారు. ఇప్పుడు జగదీష్ ను జగన్ చేరదీస్తున్నారు. ఎవరో ఒకరు తెలుగుదేశం నుంచి తన పార్టీలోకి వచ్చినట్టుగా ప్రచారం జరిగితే.. పార్టీకి క్రేజ్ పెరుగుతుందని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. మరి.. జగదీష్ ప్రకాష్ వస్తే.. రోజా పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. రోజా జగన్ ను ఎంతగా కీర్తిస్తూ వచ్చినా.. జగన్ ఆమెకు ఎగ్జిట్ గేట్ చూపిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. జగదీష్ ప్రకాష్ రాకను రోజా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది గానీ.. వారి మాట చెల్లుబాటు అయ్యేలా లేదు. ‘దేవుడిచ్చిన అన్న’ అంటూ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి రోజా నెత్తిన పెట్టుకుంటూ వచ్చారు. సొంత చెల్లెలికే అన్యాయం చేసి గెంటేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు దేవుడిచ్చిన చెల్లెలి రాజకీయ జీవితానికి కూడా భరతవాక్యం పలికేస్తున్నారని ఆమె వర్గం నాయకులు చర్చించుకుంటున్నారు.