జగన్ – కేజ్రీవాల్.. పతనం వైపు పోలికలు!

నిరుడు ఏపీలో దారుణంగా ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్, ఇవాళ ఢిల్లీలో మూడో వంతు సీట్లు కూడా దక్కకుండా ఓడిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీలు రెండూ ఒకే తాను ముక్కలు అన్నట్టుగా నిరూపణ అవుతోంది. ప్రజలు ఈ పార్టీలను తిరస్కరించిన తీరు వెనుక.. అనేక పోలికలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో పాల్పడిన దురాగతాలు, అవినీతి అరాచక వ్యవహారాల మధ్యకూడా సామ్యం ఉంది. ప్రజలు- పాలకుల యొక్క ఎలాంటి పనులను సహించలేకపోతున్నారు.. అనేది ఈ రెండు పార్టీల పతనాన్ని చూస్తే అర్థమవుతుంది.

జగన్మోహన్ రెడ్డి.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత.. సాధించినదెల్లా ఒకే ఒక్క సంగతి. అక్కడ ఒక్క ఇటుక పేర్చి నిర్మాణమైనా చేపట్టలేదు.. తనకోసం తన కూతుళ్ల కోసం నిర్మించుకున్న ప్యాలెస్ భవంతులు తప్ప. రుషి కొండను సర్వనాశనం చేసేసి.. బోడి కొట్టించేసి, తన నివాసంలోని అన్ని బెడ్ రూములకు సముద్రం వ్యూ ఉండేలాగా.. జగన్ 500 కోట్ల రూపాయల వ్యయంతో తనకోసం భవనాలు కట్టించుకున్నారు. అక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే. ఆయన 33 కోట్లరూపాయలతో శీష్ మహల్ కు మరమ్మతులు చేయించుకునే నెపంతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినయోగం చేశారు. వీరిద్దరూ వృథా చేసిన ధనం మధ్యలో వ్యత్యాసం ఉంది. దానికి తగ్గట్టుగానే  జగన్కు 11 సీట్లు దక్కితే కేజ్రీవాల్ కు 22 సీట్లు దక్కాయి. ఇంకో సారూప్యత ఏమిటంటే.. ఈ ఇద్దరు నాయకులు కూడా తమ కోసం ప్రభుత్వ ధనం వెచ్చించి చేసుకున్న భవంతుల్లోకి కనీసం అడుగు పెట్టకుండానే పదవులనుంచి దిగిపోయారు.

ఈ రెండు పార్టీల పతనంలో మరో పోలిక కూడా ఉంది. రెండు పార్టీలూ లిక్కర్ కుంభకోణాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నాయి.  జగన్మోహన్ రెడ్డి సరికొత్త లిక్కర్ పాలసీ తేవడం ద్వారా మూడువేల కోట్లరూపాయల సొమ్ము కాజేశారు. ఢిల్లీ ప్రభుత్వం పాపం అంత పెద్ద మొత్తం కాజేయలేదు. వారి అవినీతి మొత్తం వందల కోట్ల రూపాయల్లోనే ఉంది. వారు పాల్పడిన లిక్కర్ స్కామ్ కు అసలు సూత్రధారిగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఉంది. అప్పటి వైఎస్సార్ సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా భాగస్వామిగా ఉండడం గమనించాల్సిన సంగతి.

ఇలా ఏపీ మరియు  ఢిల్లీ రాష్ట్రాలలో చిరస్థాయిగా అధికార పీఠం మీద తామే వెలిగిపోతూ ఉండాలని కోరుకున్న ఇద్దరు నాయకులు.. చాలా త్వరగా భ్రష్టుపట్టిపోవడం గమనించాల్సిన సంగతి. ఇద్దరి అవినీతి ప్రజల తిరస్కరణ వ్యవహారాలు ఒకే రీతిగా ఉన్నాయి. ప్రభుత్వాలు ఏ తప్పులు చేసినా ప్రజలు క్షమించరు అనడానికి ఈ రెండు పార్టీల పతనం ఒక పెద్ద ఉదాహరణగా భావించాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories