ఆర్జీవీ : అనగనగా ఒక మాఫియా కథ!

రాంగోపాల్ వర్మకు చాలా ఇష్టం కనుక ఒక మాఫియా సినిమా కథ చెప్పుకుందాం..
అనగనగా ఒక మాఫియా ముఠా ఉంటుంది. కరడు గట్టిన హంతుకలు, దోపిడీలకు పాల్పడేవారు, దందాలు చేసేవాళ్లు అందులో ఉంటారు. ముఠా నాయకుడు ఇంకా కర్కోటకుడు. అలాంటి సమయంలో అప్పడాలు అమ్ముకుంటూ ఒక చిన్న వ్యాపారం చేసుకునే యువకుడు.. తన బిజినెస్ లో భాగంగా  వారివద్దకు వెళ్లి..  ఒక ప్యాకెట్ అప్పడాలు అమ్ముకుని వెళతాడు. మాఫియా డాన్ యొక్క డెన్ అద్భుతంగా ఉందని నచ్చి, ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏదో సందర్భంలో.. ‘పలానా అప్పుడు పలానా మాఫియా ముఠా వద్దకు ఎందుకెళ్లావ్’ అని పోలీసులు అడిగితే.. కంగారు పడి అబద్ధాలు చెప్తాడు. బుకాయించాలని చూస్తాడు. ఈలోగా పోలీసులకు అనుమానం పెరుగుతుంది. ఆ కుర్రాడికి కంగారు పెరిగి మళ్లీ మాఫియా డాన్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ‘నీకెందుకు నీ ప్రొటెక్షన్ మేం చూసుకుంటాంలే’ అని డాన్ హామీ ఇచ్చాడు. పోలీసులు మళ్లీ పిలిచి విచారించే సరికి ఇంకా భయపడి మళ్లీ డాన్ వద్దకు వెళ్లాడా యువకుడు. ‘ఏం భయపడొద్దు.. ఈసారి పోలీసులు ఏమైనా అంటే కాల్చి పారేయ్’ అంటూ మాఫియా డాన్ ఒక రివాల్వర్ ఇచ్చి పంపాడు. ఇంటికి తిరిగి వెళుతుండగా.. పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తనిఖీలు చేస్తుండడం చూసి కుర్రాడు మళ్లీ భయపడ్డాడు. ఆ భయంలో బండి నడుపుతూ కింద పడ్డాడు. జేబులోంచి రివాల్వర్ బయటపడింది. పోలీసులు గమనించి.. తుపాకీతో ఎందుకు తిరుగుతున్నావ్? అంటూ నాలుగు వడ్డించారు. నిజం చెప్పడానికి మళ్లీ భయపడ్డాడు. అరెస్టు చేశారు. మాఫియా డాన్ లాయరును ఏర్పాటుచేసి బెయిలు ఇప్పించాడు. కుర్రాడు ఇప్పుడు ఇంటింటికీ తిరిగి అప్పడాలు అమ్ముకోవడం మానేశాడు. పూర్తిగా ఆ మాఫియా ముఠాలు ఒక మెంబరు అయిపోయాడు.
-అదీ స్టోరీ!

ఇది సరికొత్త మాఫియా స్టోరీ. రాంగోపాల్ వర్మ తీయబోతున్న కొత్త సినిమా కోసం ఆయన రాసుకున్న స్క్రిప్టు కాదు ఇది. ఆయన జీవితం కోసం దేవుడు రాసుకున్న స్క్రిప్టు. లేదా దేవుడి పేరు సదా చెబుతూ ఉండే జగన్ రాసిన స్క్రిప్టు.

సినిమాలు తీసుకుని బతికే, రాజకీయ భావజాలాలకు దూరంగా ఉండే.. ఎప్పుడు ఏ సినిమా తీస్తూ ఉంటే.. దాని ప్రమోషన్ కోసం అందులోని పాత్రలకు చెందిన జీవితాలను కీర్తిస్తూ గడిపేసే రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు కేసులు నమోదు అయినా తర్వాత.. వైసీపీ వారి సాయం పదేపదే తీసుకుంటూ పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తగా మారిపోతున్నారు.

ఒంగోలులో పోలీసు విచారణకు వెళ్లిన రాంగోపాల్ వర్మ వారితో .. తన ఫోను, మేనల్లుడితో సహా కారులో హైదరాబాదు వెళ్లిపోయిందని చెప్పారు. పోలీసులు ఆ ఫోను లొకేషన్ ట్రాక్ చేస్తే అది అక్కడే వైసీపీ జిల్లా పార్టీ ఆఫీసులో కనిపించింది. పోలీసులు అక్కడకు వెళ్లి వర్మ ఫోను గురించి అడిగితే.. వైసీపీలో ప్రస్తుతానికి నెంబర్ టూగా చెలామణీ అవుతున్న చెవిరెడ్డి  భాస్కర రెడ్డి వారి మీద విరుచుకుపడ్డారు. వర్మ ఫోను ఇక్కడెందుకు ఉంటుందని అన్నారు. కానీ ప్రజలకు, పోలీసులకు విషయం అర్థమైపోయింది. వర్మ జీవితం పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయిందని! ఒంగోలు పోలీసుల ఎదుటకు వెళ్లడానికి ముందే వర్మ చెవిరెడ్డి, బూచేపల్లి తదితర వైసీపీ నాయకులతో సమావేశమై ఆ తర్వాత వెళ్లడం కూడా గమనార్హం.
పోలీసుల వద్ద నిజాయితీగా వ్యవహరించకుండా వర్మ తప్పు మీద తప్పు చేస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories