తమకు అనుకూలంగా, తమకు ఇబ్బంది లేకుండా వాంగ్మూలం చెప్పించుకోవాలనేది మాత్రమే వారి టార్గెట్! అందుకు సామదాన భేద దండోపాయాలలో ఏదో ఒకటి అనుసరించి వారు తమ కార్యం నెరవేర్చుకోవాలనుకుంటారు. ప్రత్యేకించి వీటిలో దాన- దండోపాయాలంటేనే వారికి మక్కువ ఎక్కువ. అందుకే ఒప్పుకుంటే డబ్బు ఆఫర్ చూపించడం.. ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరించడం రెండు మార్గాలను మాత్రమే అనుసరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో అప్రూవర్ గా మారిన దస్తగిరి, కీలక నిందితుడు శివశంకరరెడ్డి కొడుకు చైతన్య రెడ్డి నుంచి ఎదురైన అనుభవాలు ఇవి. వైఎస్ కుటుంబానికి అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ మాత్రమే కాదు.. చెప్పకపోతే జైలు నుంచి బయటికొచ్చాక నరికి చంపుతాం అని కూడా బెదిరించినట్టు దస్తగిరి విచారణలో చెబుతున్నారు.
2023 నవంబరు నాటికి దస్తగిరి ఓ ఎట్రాసిటీ కేసులో రిమాండు నిందితుడిగా కడప సెంట్రల్ జైలులో ఉన్నారు. జైల్లో వైద్య శిబిరం పేరుతో వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి జైలుకు వెళ్లారు. దస్తగిరి బ్యారకు కూడా వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఆ సమయంలో బ్యారక్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాను కూడా తొలగించినట్టు దస్తగిరి చెబుతున్నాడు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి, అనుచరుడు శివశంకర్ రెడ్డికి అనుకూలంగా చెప్పడానికి 20 కోట్లు ఆఫర్ చేశారని, ఒప్పుకోకపోతే బయటకు వచ్చాక చంపుతాం అన్నారని దస్తగిరి చెబుతున్నారు.
ఈ వ్యవహారం గురించి ఆయన ఫిర్యాదు పై తాజాగా పోలీసులు కేసు నమోదు చే సిన తర్వాత.. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ కడపకు వచ్చి దస్తగిరిని విచారించారు. ఆ సమయంలోనే ఈ విషయం బయటపెడితే.. జైలు వెలుపల ఉన్న తన భార్యా పిల్లలకు హాని జరుగుతుందనే భయంతోనే తాను సైలెంట్ గా ఉండిపోయినట్టు, తనను కలిసిన భార్యకు మాత్రం చెప్పినట్టు దస్తగిరి వెల్లడించారు.
ఆమె భయంతో ఆ విషయం మీడియాకు వెల్లడించగా.. ‘మతి స్థిమితం లేనందువల్లే ఆమె అలా మాట్లాడినట్టు’ చెప్పాల్సిందిగా.. అప్పటి కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ తనను వేధించినట్టు కూడా దస్తగిరి అంటున్నారు. ఈ వ్యవహారంలో అసలు కీలక నిందితుడు చైతన్యరెడ్డి, అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ లను కూడా విచారణకు రావాల్సిందిగా పోలీసులు పిలిచినట్టు వార్తలు వస్తున్నాయి. దస్తగిరిని లొంగదీసుకోవడానికి వైఎస్ అవినాష్ రెడ్డి కోటరీ ఎంత దుర్మార్గాలకు దిగిందో తెలిసి ప్రజలు నివ్వెరపోతున్నారు.