ఎమ్మెల్యేగా ఉంటూ శాసనసభకు వెళ్లకపోతే తమరిని గెలిపించిన ప్రజలకు ఏం న్యాయం చేస్తారు సార్ అని ప్రశ్నించినందుకు … మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన లాజిక్ చెబుతున్నారు. ఆయన దృష్టిలో శాసనసభకు వెళ్లి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది ఎదురెదురుగా పడి కొట్టుకోవడం లాంటిదట. కుస్తీ పడడం లాంటిదట. ఎదురెదురుగా ఉండాల్సిన పని లేదుట.. కేవలం మీడియా ముందు ఉండి సమస్యలను ప్రస్తావిస్తే సరిపోతుందిట. ఇంత విచిత్రమైన లాజిక్ తో కూడిన జ్ఞానం కలిగి ఉన్న ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. ఆ భాగ్యానికి అసలు ఎమ్మెల్యేగా ఉండకపోతే మాత్రం ఏమిటి? నిత్యం ప్రతిపక్షంలో ఉంటూ.. ఆయన చెబుతున్నట్టుగా ప్రజలకు సందేశం పంపడానికి మీడియా ముందు మాట్లాడుకుంటూ సరిపోతుంది కదా? అనేది ప్రజల సందేహం. ఎటూ సొంత చానెల్ దుకాణం ఉన్నది గనుక.. ఆయన ఏం మాట్లాడినా అది లైవ్ లో వెళుతుంటుంది కాబట్టి… ఆయన కోరిక తీరిపోతుంటుంది కదా అని జనం నవ్వుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి తన అలవాటు కొద్దీ.. తనకు భజన చేసే కొందరు మీడియా ప్రతినిధుల్ని మాత్రం ఇంటికి పిలిచి చిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. తాను చెప్పదలచుకున్న సమాధానాల కోసం ప్రశ్నల్ని కూడా ముందే తయారుచేసి వారికి అందజేసినట్టుగానే వారు అడిగారు. ఆయన చెప్పదలచుకున్నది వారికి చెప్పారు. అలా ఒక స్క్రిప్టెడ్ నాటకం జరిగింది.
మేం అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం అనే దానికంటె.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుందని వారు భయపడుతున్నారని అనడం బాగుంటుంది అని జగన్ తనకు తోచిన చిత్రమైన భాష్యం చెప్పారు. మేం ప్రజలకు సందేశం ఇవ్వాలి. మీడియా ఎదుట ప్రశ్నిస్తాం.. వారిని జవాబు చెప్పమని అడగండి అంటున్నారు. జనం జవాబు ఏంటంటే.. ‘జగనన్నా తమరు జీవితాంతం మీడియా ఎదుటనే అడుగుతూ ఉండండి.. పర్లేదు వారు జవాబులు చెబుతుంటారు..’ అని!
జగన్ ప్రెస్ మీట్ లో హైలైట్ ఏంటంటే.. జనం చంద్రబాబు పాలనతో విసిగిపోయి ఉన్నారట. చంద్రబాబు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారట. కాబట్టి ఎన్నికలు ఎంత తొందరగా వస్తే అంత మంచిది.. మా ప్రభుత్వం వచ్చేస్తుంది అంటున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండగా.. ఒక్కచోట కూడా పోటీ చేయడానికి ధైర్యంలేని ఈ పెద్దమనిషి.. ఎంత తొందరగా ఎన్నికలొస్తే అంత తొందరగా మా ప్రభుత్వం వస్తుందని ప్రగల్భాలు పలకడమే తమాషా.