సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోతున్నదో గమనించడానికి ఆ పార్టీనుంచి రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్న ప్రజాప్రతినిధుల లెక్కలు గమనిస్తే చాలు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, పలువురు రాజ్యసభ ఎంపీలు వైసీపీ కి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తన పార్టీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను మాత్రం జగన్ జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అది కూడా ఎంతకాలం కాపాడుకోగలుగుతారో తెలియదు. రాజ్యసభ ఎంపీల్లో ఇంకా కొందరు రాజీనామా చేసే అవకాశం ఉన్నదని పుకార్లు వస్తున్నాయి. అదే విధంగా ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్వయంగా చెప్పిన మాటలు గమనిస్తే.. అనేక మంది ఎమ్మెల్సీలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని కూడా అర్థమవుతోంది. అయోధ్య మాటలతో ముడిపెట్టి ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. తిరుపతిలో ఉండే వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కూడా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతారనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
పైగా సిపాయి సుబ్రమణ్యం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువల గురించి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే.. ఆయన ఆ పార్టీ తయారు చేసుకున్న నాయకుడు కానే కాదు. ఆయన 2023 ఫిబ్రవరి 20వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడుగా ఉన్నారు. కులపరంగా తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లను ప్రభావితం చేయగల వ్యక్తి, డాక్టరుగా కూడా స్థానికంగా ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తి అనే నమ్మకంతో.. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి తమ పార్టీలో చేర్చుకున్నారు. తమ పార్టీ కండువా కప్పిన గంటల వ్యవధిలోనే ఆయనను ఎమ్మెల్సీ చేశారు. ఆయనేమీ భావజాలం పరంగా జగన్ అనుయాయుడు కూడా కాదు. కేవలం.. అప్పటికి వారి ప్రభుత్వం ఉన్నది గనుక.. చట్టసభల అవకాశం ఆఫర్ ఇచ్చారు గనుక వచ్చారు అంతే!
ఆయన తాజా పరిణామాల్లో తిరుపతి మునిసిపాలిటీ డిప్యూటీ మేయరు ఉప ఎన్నిక సందర్భంలో ఓటింగుకు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్సీ గనుక.. ఆయన ఎక్స్ అఫీషియో మెంబరుగా తన ఓటు ఇక్కడ నమోదు చేయించుకున్నారు. సగం మందికి పైగా కార్పొరేటర్లు తెలుగుదేశంలో చే రిన నేపథ్యంలో.. ప్రతి ఓటును వైసీపీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా.. సిపాయి సుబ్రమణ్యం ఓటింగుకు రాలేదు. ఆయనను తెలుగుదేశం కిడ్నాప్ చే సిందని వైసీపీ ఆరోపించింది. అసలు తన ఇంటికి కూడా ఎవ్వరూ రాలేదని, కిడ్నాప్ అవాస్తవం అని.. ఆయన స్వయంగా వీడియో ఇచ్చారు. వైసీపీతో భావసారూప్యతలేని ఎమ్మెల్సీ సుబ్రమణ్యం కూడా త్వరలోనే ఆ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి పరిణాామాలన్నీ కూడా అందుకు సంకేతాలేనని పలువురు విశ్లేషిస్తున్నారు.