వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సరికొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చారు. ఆ నూతన మద్యం విధానంలో ప్రెవేటు దుకాణాలను పూర్తిగా ఎత్తేశారు. మద్యం దుకాణాలు యావత్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచాయి. మద్యం దుకాణంలో పనిచేసే కుర్రాళ్లకు ఇచ్చిన ఉద్యోగాలనుకూడా.. వైసీపీ ప్రభుత్వం కల్పించని ఉద్యోగాల కింద లెక్కల్లో చెప్పుకున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లిక్కర్ ధరలను విచ్చలవిడిగా పెంచేశారు. దానికి తోడు కొన్ని బ్రాండ్లను మాత్రమే అందుబాటులో పెట్టారు. ఇలాంటి పనులు చేయడం సంఘహితం కోసమే అన్నట్టుగా చాలా బిల్డప్పులు ఇచ్చారు. వ్యసనపరులతో మద్యం తాగే అలవాటును మాన్పించడానికే ధరలను పెంచినట్టుగా జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. అలాగే.. ప్రభుత్వం దుకాణాలు నిర్వహించడం వలన అమ్మకాలతో వచ్చే ప్రతిరూపాయీ ప్రభుత్వ ఖజానాకే దక్కతుందని చాలా గొప్పలు చెప్పుకున్నారు. కానీ సీఐడీ విచారణ అనేక వాస్తవాలను నిగ్గు తేల్చిన తర్వాత.. ప్రభుత్వమే స్వయంగా దుకాణాలను నిర్వహించేలా లిక్కర్ పాలసీ తీసుకు రావడం వెనుక అసలు కీలకం వెలుగులోకి వస్తోంది. కేవలం తమ దందాలు, వాటాలు పద్ధతిగా అందుతూ ఉండడం కోసం మాత్రమే ప్రభుత్వం దుకాణాలునిర్వహించే పద్ధతి వచ్చిందని అర్థమవుతోంది.
ఎలాగంటే-
మద్యం తయారుచేసే డిస్టిలరీలను వైఎస్సార్ సీపీ దళాలు.. ప్రధానంగా మిధున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి తరఫు మనుషులు గుప్పిట్లో పెట్టుకున్నారు. తాము అడిగినంత వాటాలు ఇవ్వడానికి సుముఖత చూపించిన డిస్టిలరీలు తయారుచేసే మద్యం బాటిళ్ల ధరలను మాత్రమే పెంచారు. అలాగే.. తాము అడిగినంత వాటాలు ముట్టజెబుతున్న సంస్థలకు మాత్రమే సరఫరా నిమిత్తం ఆర్డర్లు పెట్టేవారు. అడిగినంత వాటా ఇవ్వకపోతే.. ఆ డిస్టిలరీకి దుకాణం నుంచి అసలు ఆర్డరే ఉండేది కాదు.
ప్రభుత్వం దుకాణాలు నడపడం అసలు మర్మం ఇదే. ప్రెవేటు వ్యక్తుల చేతుల్లో షాపులు ఉన్నట్లయితే.. ఏయే ఊళ్లలో ఏయే బ్రాండ్లకు ఆదరణ ఉంటుందో… వారు ఆ బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు పెట్టుకుంటూ వ్యాపారం సాగిస్తారు. అంటే మధ్యలో వైసీపీ గద్దలు కాజేయడానికి ఏమీ దారి ఉండదు. అదే సమయంలో.. మద్యం సరఫరాకు ‘ఆర్డర్’ ఇచ్చే అధికారమే తమ చేతిలో ఉంటే.. అప్పుడు డిస్టిలరీలు తాము ఆడమన్నట్లెల్లా ఆడుతుంటాయి. తాము చెప్పిన మాట వింటాయి. తమ మాట వినని డిస్టిలరీకి ఒక్క ఆర్డరు కూడా ఇవ్వకుండా వేధిస్తే.. చిటికెలో దారికి వస్తాయి. కేవలం ఈ కుట్రపూరిత ఉద్దేశంతోనే దుకాణాలను ప్రభుత్వ పరం చేశారు.