వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే, దానికి సంబంధించి.. సహేతుక కారణంతో సెలవుచీటీ పంపి అనుమతి కూడా తీసుకోకపోతే.. ఎమ్మెల్యే యొక్క శాసనసభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుందని, ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు ఒక కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నిబంధన వల్ల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పారు. అయితే అనర్హత వేటును తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి తన అహంకారాన్ని అనేక మెట్లు కిందికి దించి సెలవు చీటీ పంపుతారని అనుకోవడం భ్రమ. అదే సమయంలో.. అసెంబ్లీదాకా వెళ్లి అక్కడ రిజిస్టరులో సంతకం పెట్టేసి.. సభలో కూర్చోకుండా బయటకు వచ్చేసి- వేటు పడకుండా తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడలు అనుసరిస్తారని అనుకోవడం కూడా భ్రమ. అలాంటప్పుడు ఆయన మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడవచ్చు. అదే జరిగితే.. తర్వాతి పరిణామాలు ఏమిటి? అనే చర్చ ఇప్పుడు వైసీపీ పార్టీలో అంతర్గతంగా నాయకుల మధ్య నడుస్తోంది. పులివెందులకు ఉప ఎన్నికవస్తుంది.. ఆ ఎన్నికల్లో పోటీచేసి మళ్లీ గెలిచినా సరే.. జగన్ మళ్లీ అసెంబ్లీకి వెళ్లరు. అలాంటప్పుడు.. అలాంటి డ్రామా నడిపించి ప్రజల దృష్టిలో చులకన అయ్యే బదులుగా.. ఉప ఎన్నిక అనివార్యం అయితే గనుక.. తన భార్య వైఎస్ భారతిని పులివెందుల బరిలోంచి పోటీచేయించే ఉద్దేశంతో జగన్ ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా జగన్ తన నీడను కూడా తాను నమ్మరు. అలాంటి వ్యక్తి మరొక నాయకుడిని నమ్మి, పులివెందులలో ఎమ్మెల్యేగా పోటీచేయించడానికి ప్రోత్సహిస్తారని అనుకోవడం భ్రమ. ఆయన ఖచ్చితంగా తనకు అత్యంత నిరపాయకారియైన వ్యక్తిని మాత్రమే ఎంచుకుంటారు. అందుచేత వైఎస్ భారతిని పులివెందుల ఉప ఎన్నికలో పోటీచేయిస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైఎస్ భారతి.. కేవలం పులివెందుల నియోజకవర్గంలో భర్త తరఫు నామినేషన్లు దాఖలు చేయడం, భర్త తరఫున ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తప్ప.. పార్టీలో ఎన్నడూ యాక్టివ్ రోల్ పోషించలేదు. నిజానికి పార్టీ నిర్ణయాలపై ఆమె ప్రభావం ఎంతో ఉంటుందిగానీ.. బహిరంగంగా.. పార్టీ కార్యక్రమాల్లో నాయకురాలిగా కనిపించడం అనేది జరగదు- అని పార్టీ వారు చెబుతుంటారు. కానీ.. పులివెందుల ప్రజలందరికీ జగన్ తర్వాత అంతగా చిరపరిచితురాలైన నాయకురాలు అనే చెప్పాలి. అంతగా ఆమె ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుంటారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా.. వివిధ సందర్భాల్లో అక్కడ ప్రజలతో కలుస్తుంటారు. ఈకారణాల వల్ల.. పులివెందులకు ఉప ఎన్నిక వస్తేగనుక, వైఎస్ భారతిని బరిలో దించడమే సరైన వ్యూహం అనే అభిప్రాయమే పలువురిలో వినిపిస్తోంది.
అదే జరిగితే గనుక.. వైఎస్ భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం అనేది.. ముందుముందు కొనసాగుతుందో, లేదా, భర్త విరామసమయం వరకు మాత్రమే ఉండి తర్వాత మళ్లీ తెరవెనుకకు వెళతారో అనే చర్చలు కూడా సాగుతున్నాయి.