వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుపుతున్న తీరును గమనిస్తే కార్యకర్తల్లో రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఆయన పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్న సరళి.. పార్టీని మొత్తంగా ముంచేలా ఉన్నదే తప్ప.. కాపాడేలా లేదని భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఒక పోరాట స్ఫూర్తిని నింపేలాాగా జగన్ నాయకత్వం కనిపించడం లేదని అంటున్నారు. ఒకవైపు పార్టీనుంచి విజయసాయిరెడ్డి లాంటి కీలక నాయకులు కూడా వరుసకట్టి వెళ్లిపోతున్న తరుణంలో.. పార్టీని సరైన దిశగా నడిపించే నాయకత్వ పటిమ జగన్ లో కనిపించడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా కూడా మోగిన సమయంలో.. ఆ విషయమై కనీస కసరత్తు ప్రారంభించకుండా జగన్ మిన్నకుండడమే శ్రేణుల్లో ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది.
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా జిల్లాలు కలిపి రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయసీటు సంగతి ఎలా ఉన్నా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని మోహరించకపోతే అది ఆత్మహత్యా సదృశం అవుతుందని.. పార్టీ శ్రేణులు డీలా పడిపోతాయనే అభిప్రాయం పలువురిలో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముందుగా ఈ ఎన్నికల మీదనే దృష్టి సారిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పార్టీ అంటే తనలో ఉండే నిర్లక్ష్యానికి ప్రతీక అన్నట్టుగా.. జగన్ లండన్ నుంచి రావడమే బెంగుళూరు ఎయిర్ పోర్టులో దిగారు. అక్కడినుంచి యలహంకలోని తన ప్యాలెస్ కు వచ్చి తీరిగ్గా ఆ తరువాత తాడేపల్లి చేరుకున్నారు. వచ్చిన తర్వాత.. పార్టీ కీలక నాయకులతో ఓసారి.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో మరోసారి సమావేశం అయ్యారు. ఆ భేటీల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి నిర్ణయాలు తీసుకునే వ్యవహారం జరగనేలేదు.
ఈలోగా.. మునిసిపాలిటీల ఉప ఎన్నికలు కూడా వచ్చాయి. అన్నీ తెలుగుదేశం పరం అయ్యాయి. అక్రమంగా గెలిచారంటూ వారిని నిందించడంతో రెండు రోజులు గడిపారు. ఉన్న కార్పొరేషన్లు కూడా చేజారుతాయనే భయంతో విజయవాడ కార్పొరేటర్లను పిలిపించుకుని మీటింగు పెట్టుకున్నారు.. జగన్ ఇవన్నీ చేస్తున్నారే తప్ప ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కనీస కసరత్తు కూడా చేయడం లేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇంతకూ పోటీచేసే ఉద్దేశం ఉందా? లేక, గత పట్టభద్ర ఎన్నికల సమయంలో ఎగ్గొట్టినట్టుగానే.. సాకులు చెప్పి పోటీనుంచి తప్పుకుంటారా? అనేది నాయకుల అనుమానం. ఒకవైపు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రజల్లో వస్తున్నదని అంటూ.. పట్టభద్ర ఎన్నికల్లో పోటీచేయకపోతే పరువుపోతుందని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు.