ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక సరికొత్త విధానాన్ని ప్రకటించారు. పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన ఆలోచన ఇది. ప్రపంచంలో ఎక్కడాలేని ఆలోచన ఇది. పేదల జీవితాలను ప్రగతి దిశగా నడిపించేందుకు.. ఆయన బుర్రలో పుట్టిన ఆలోచన ఇది. సమాజంలో కుబేరులను- కుచేలులుగా పేర్కొనదగిన నిరుపేదలను కూడా అనుసంధానిస్తూ.. పేదలజీవితాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా.. తద్వారా వారు.. కొత్త పనులు చేయగలిగేలా అవకాశాలు సృష్టించడానికి చంద్రబాబునాయుడు ఈ విధానాన్ని తీసుకువచ్చారు. పబ్లిక్- ప్రెవేట్- పీపుల్స్ పార్టిసిపేషన్ ద్వారా జరిగే కార్యక్రమానికి పీ4గా నామకరణం చేశారు. ఈ వినూత్న విధానాన్ని ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించబోతున్నట్టుగా చంద్రబాబు చెప్పడం విశేషం.
పీ4 అనేది ప్రజలు ఎన్నడూ వినని కొత్త ఆలోచన. చంద్రబాబునాయుడు తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొలువుతీరిన తర్వాత.. మరింత వినూత్నమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విధానంలో సంపన్నులు, పేదల కోసం పెట్టుబడులు పెడతారు. అంటే ప్రైవేట్- పీపుల్ భాగస్వామ్యం అన్నమాట. ఈ ఇరువురి మధ్యలో పబ్లిక్- అంటే ప్రభుత్వం ఒక సంధానకర్తగా, ఒక రకమైన భాగస్వామిగా ఉంటుంది. దీనినే పీ4 విధానంగా అభివర్ణిస్తున్నారు. అనేక మంది ఎన్నారైలు ఇలాంటి విధానానికి అనుకూలంగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు.
కేవలం ఎన్నారైలు అని మాత్రమే కాకుండా.. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకు తమ తమ ప్రాజెక్టులను చిన్న యూనిట్లుగా వికేంద్రీకరించి అనేక ప్రాంతాల్లోకి విస్తరించాలనే ఆలోచన ఉంటుంది. కానీ కార్యక్షేత్రంలో మానవ వనరుల లభ్యత లేక వారు ముందడుగు వేయలేకపోతుంటారు. అలాంటి వందల వేల మంది పారిశ్రామిక వేత్తలకు పీ4 విధానం అనేది ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుందని విశ్లేషకులు నిపుణులు అంచనా వేస్తున్నారు.
చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందునుంచి సంపదను సృష్టించే మార్గాలు తనకు తెలుసునని చెబుతూ వచ్చారు. ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత.. ఇవాళ్టి వరకు కూడా.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. సంపద సృష్టి అనే మాటను.. చంద్రబాబును గేలి చేయడానికి వాడుకుంటున్నారు.
కానీ పీ4 అనే విధానం కార్యరూపం దాలిస్తే గనుక.. పేదల ఆలోచనల్లోకి సంపన్నులు పెట్టుబడులు పెట్టి భాగస్వాములు అయినా.. అలాగే సంపన్నుల వ్యాపారాల్లోకి పేదలు కార్యకుశలతగల భాగస్వాములుగా మారినా.. సునాయాసంగా సంపద సృష్టి జరుగుతుంది. వేల లక్షల మంది పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు సాధ్యమవుతుంది. పీ4 విధానం అనేది రాష్ట్రం రూపురేఖలను మార్చే సరికొత్త ఆర్థిక మంత్రం అవుతుందని పలువురు అంటున్నారు. పీ4 విధానం గురించి కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలన్ని చంద్రబాబు పాలన వైపు తలతిప్పి చూసే వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు.