తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, శాసనసభకు రాబోనని భీష్మించుకుని, కుటిలరాజకీయం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందని రఘురామక్రిష్ణ రాజు ప్రకటించిన తరువాత.. రాష్ట్రంలో అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జగన్ మీద అనర్హత వేటు తప్పదని, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని కూడా ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో ప్రకటించారు. ఈ అంశాలు రాష్ట్రంలో సహజంగానే సంచలనం రేకెత్తించాయి. చట్టంలోని నిబంధనలను చాలా సునిశితంగా ఫాలో అవుతూ ఉండే రఘురామకృష్ణరాజు ప్రకటించారు గనుక.. పులివెందుల ప్రజలు ఉప ఎన్నికకు సిద్ధం కావాల్సి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇందులో ట్విస్టు ఏమిటంటే ఉప ఎన్నిక అనివార్యం అయితే గనుక ఆ స్థానం నుంచి వైయస్ జగన్ బదులుగా ఆయన సతీమణి భారతి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
వైఎస్ జగన్ కు ప్రతిపక్షనేతగా శాసనసభలో అడుగుపెట్టడమే ఇష్టం లేదు. ఆయన పులివెందులలో మళ్లీ పోటీచేసి గెలిచినా సరే.. మళ్లీ సభకు డుమ్మా కొట్టి ఇంట్లో కూర్చుంటారు. ఇంకో అరవై రోజుల సభా పర్వం తరువాత.. మళ్లీ ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. ఇలా అయిదేళ్లలో కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంది. అలాంటి పని జరిగితే.. పార్టీ పరువు తన పరువు పోతుందని జగన్ ఆలోచిస్తున్నారు. అందుకే.. తన బుదులుగా.. భార్య భారతిని ఎమ్మెల్యే చేస్తే.. అప్పుడు సభకు వైసీపీ సభ్యులు హాజరు కావడానికి కూడా పెద్దగా అభ్యంతరం ఉండదని ఆయన ఆలోచిస్తున్నారు.
జగన్ 2.0 సర్కారు వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడుతుందని జగన్ కలగంటూ ఉన్నారు. ముందే ఒక దఫా భార్య భారతిని ఎమ్మెల్యే చేస్తే గనుక.. ఆ తర్వాత.. మరోసారి కూడా ఎమ్మెల్యే చేయవచ్చునని.. అధికార కేంద్రంలో తన తర్వాతి నాయకురాలిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రొజెక్టు చేయవచ్చునని జగన్ ఆలోచిస్తున్నారని సమాచారం.
శాసనసభకు హాజరుకాకపోవడం వలన అనర్హత వేటు పడితే గనుక.. దానిని తప్పించుకోవడం ఎలా అనే విషయంలో రకరకాల మాయోపాయాల గురించి జగన్ ఆలోచిస్తుండవచ్చు గాక.. కానీ.. పులివెందుల ప్రజలు మాత్రం ఆయన వ్యూహాల్ని అసహ్యించుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. తాము ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సభకు వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడం.. ఆయన మీద తాము పెట్టుకున్న నమ్మకాన్ని అవమానించడమే అని అక్కడి ప్రజలు భావించే అవకాశం ఉంది. మరి ఇలాంటి సంక్షోభ వాతావరణాన్ని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.