వివేకా హత్య కేసులో కొత్త కొత్త మలుపులు!

జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపులు తీసుకుంది. ఇప్పటిదాకా కేసులో కనపడని, వినపడని కొందరి పాత్ర గురించి ఫిర్యాదులు అందడంతో నలుగురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకాహత్య కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నలుగురూ కూడా ఇప్పటిదాకా పోలీసులు విచారించనటువంటి కొత్త వారు కావడం వలన.. ప్రస్తుతం వీరిని విచారించడం వలన కొత్త సంగతులు వెలుగులోకి వస్తాయనే నమ్మకం పలువురిలో ఉంది. వీరి విచారణ ద్వారా దొరికే కీలక ఆధారాలు, ఇప్పటికే అనుమానితులుగా ఉన్న వ్యక్తుల పాత్రను నిర్ధరించడానికి ఉపయోగపడతాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇంతకూ అప్రూవర్ దస్తగిరి ఏం ఆరోపించారు?

దస్తగిరి 2023లో ఒక కేసులో నిందితుడుగా కడప జిల్లా సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో.. తనను బెదిరించారని, ఇబ్బంది పెట్టారని దస్తగిరి తాజాగా కేసు పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు అయిన శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జిల్లా జైలు సూపరింటెండెంటుగా పనిచేసిన ప్రకాశ ల మీద కేసు నమోదు అయింది.

2023లో దస్తగిరి కడప జైలులో ఉన్న సమయంలో అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆ క్యాంపు.. వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ క్యాంపు ముసుగులో జైలులోకి వెళ్లి ఖైదీలను విడివిడిగా కలిసే అవకాశం కూడా దొరకబుచ్చుకున్న డాక్టర్ చైతన్యరెడ్డి తనను ప్రలోభపెట్టినట్టుగా, మాట వినకుంటే ఊరుకోం అని బెదిరించినట్టుగా దస్తగిరి చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.
అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించారని, అందుకు 20 కోట్లు ఇవ్వడానికి ఆఫర్ చూపారని దస్తగిరి ఆరోపించారు. వీరితో పాటు జైలు సూపరింటెండెంటు ప్రకాశ్ కూడా తనను ఇబ్బందిపెట్టినట్టు చెప్పారు. ఇప్పుడు దస్తగిరి ఫిర్యాదు చేసిన నలుగురి మీద ఆరోపణలు గతంలోనూ ఉన్నాయి. ఆయన పలుమార్లు మీడియా ఎదుట వెల్లడించారు. అయితే జగన్ సర్కారు ఉండడం వలన కేసు నమోదు కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దస్తగిరి ఫిర్యాదుపై కేసు నమోదు అయింది. ఒక నిందితుడి కొడుకు, మిగిలిన పోలీసు అధికారులను విచారించబోతున్నారు. దస్తగిరిని ప్రలోభ పెట్టడానికి కారణం ఏమిటి? తెరవెనుకనుంచి ఎవరు ఆ ఆఫర్ ను ముందుకు పంపారు అనే వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తారు. నిందితుడి కొడుకుతోనే వైద్యశిబిరం ఏర్పాటుచేయించాల్సిన అవసరం ఎలా ఏర్పడిందో.. జైలు సూపరింటెండెంట్ ను కూడా విచారిస్తారు. ఈ నలుగురి విచారణలో.. అసలు అనుమానితులైన అవినాష్ రెడ్డి, ఆయన తన తండ్రి పాత్ర ఏ కొంతమేరకైనా వెలుగులోకి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories