సమాజంలో బాగా వెనుకబడి బలహీన వర్గాల్లో గీతకార్మిక కుటుంబాలు కూడా ఉంటాయి. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా.. వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటూ… అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ సమసమాజ స్థాపనకు దారితీసేలా పనిచేయాలి. ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నది. మద్యం దుకాణాల కేటాయింపు విషయంలో.. ప్రభుత్వం గీత కార్మిక కుటుంబాలకు ప్రత్యేకంగా మేలు చేయదలచింది. మొత్తం 3450 దుకాణాల్లో పది శాతం దుకాణాల్ని ఆ కులాల వారికి 50 శాతం డిపాజిట్టు చెల్లింపుతోనే కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. అయితే గీత కార్మిక కుటుంబాల కులాలపై విషం చిమ్ముతూ రాజకీయ ప్రేరేపితంగా.. కొందరు మద్యం దుకాణాల యజమానులతో హైకోర్టులో కేసులు వేయించడం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది.
యాభైశాతం డిపాజిట్టుతోనే గీత కార్మిక కులాల వారికి దుకాణాలు కేటాయిస్తే.. వారు తక్కువ ధరకే మద్యం విక్రయిస్తారని.. దానివల్ల తాము నష్టపోతాం అని మద్యం దుకాణదారులు కొందరు.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కులాలకు ఇవ్వకుండా లైసెన్సులు రద్దు చేయాలని, వారి కేటాయింపులపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే స్టే ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు, తుదితీర్పుకు లోబడి కేటాయింపు ఉంటుందని ప్రకటించింది.
అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఒకటుంది. రాష్ట్రప్రభుత్వం 2024 సెప్టెంబరులో కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చింది. గీత కులాల వారికి పదిశాతం దుకాణాల కేటాయింపు అనేది ఆ పాలసీలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆ పాలసీలోని విధివిధానాలను పరిశీలించిన తర్వాతే.. ఇప్పుడు దుకాణాలు పొందిన వారందరూ కూడా.. దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల సమయంలో మిన్నకుండిపోయి.. ఇప్పుడు ఆ కులాలకు దుకాణాలు ఇవ్వద్దని కేసులు వేయడం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దల ప్రమేయం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.
గీత కులాలకు ఎన్డీయే సర్కారు ఈ రీతిగా న్యాయం చేయడం .. ఆ కులాల్లో ఆ పార్టీలకు ఆదరణ పెంచుతుందనే భయం వైసీపీలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే తెర వెనుకనుంచి తమకు అనుకూలురైన వ్యక్తుల ద్వారా.. ఈ కేసులు వేయించారని వినిపిస్తోంది.
గీతకులాల వారి దుకాణాల్లో తక్కువ ధరకు విక్రయిస్తే తాము నష్టపోతాం అని వాదించడం ఒక ఎత్తు. ప్రత్యేకించి ఆ దుకాణాల్లో తక్కువ ధరలకు అమ్మకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరితే అది ధర్మ సమ్మతంగా ఉండేది. కావలిస్తే అందుకు వారు ఏవైనా సూచనలు చేయవచ్చు కూడా. అలా కాకుండా.. అసలు ఆ కులాలకు దుకాణాలు ఇవ్వడమే కుదరదని వాదించడం వైసీపీ విద్వేష రాజకీయాలకు నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.