తిరుపతి ‘డిప్యూటీ’ తెలుగుదేశం పరం!

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇక భవిష్యత్తు లేనే లేదని గుర్తించిన అక్కడి కార్పొరేటర్లు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక సంస్థల నాయకుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఆలోచన సరళి నడుస్తుందో అదే ఆలోచన అక్కడ కూడా నడిచింది. తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచిన సగం మంది కార్పొరేటర్లు తెలుగుదేశం వైపు వెళ్లారు. ఎమ్మెల్యే పదవి మీద ఆశపడి.. డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసిన వెళ్లిన వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని ఇప్పుడు ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. రాష్ట్రంలోనే పలు ఉప ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠభరితంగా, ఉద్రిక్తంగా జరిగిన ఉపఎన్నికలో తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ ఛైర్మన్ స్థానాన్ని ఎట్టకేలకు తెలుగుదేశం కార్పొరేటర్ మునికృష్ణ దక్కించుకున్నారు.

తిరుపతిలో 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత మునిసిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో అందరికీ తెలుసు. తెలుగుదేశానికి, జనసేనకు చెందిన వారు కనీసం నామినేషన్ కూడా వేయనివ్వకుండా పోలీసుల మద్దతుతో అడ్డుకున్నారు. కిడ్నాపులు చేశారు. నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారు. రకరకాల దౌర్జన్యాలు చేసి మొత్తానికి 49లో 48 స్థానాలను గెలుచుకున్నారు. ఒక్క సీటులో తెదేపా గెలుపొందింది.

సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ మారింది. కేవలం 11 సీట్ల పరాభవం మాత్రమే కాదు.. జగన్ పార్టీని నడుపుతున్న తీరును గమనించి.. మళ్లీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఎంతో మందిలో సడలిపోయింది. దానికి తగ్గట్టుగానే తిరుపతిలో కూడా 22 మంది తెలుగుదేశంలో చేరారు. భూమన కరుణాకర రెడ్డి వారసుడిగా ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో.. తిరుపతి డిప్యూటీ మేయరుగా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి రాజీనామా చేసి.. బరిలో దిగారు. ఓటమి తప్పలేదు. ఖాళీ అయిన డిప్యూటీ మేయరు స్థానానికి సోమవారం ఉప ఎన్నిక ప్రకటించారు. రెండు ఖాళీలు ఏర్పడడంతో 47 కార్పొరేటర్ల ఓట్లు మాత్రమే ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. మొత్తం 50మందిలో కనీసం 25 మంది హాజరుకావాల్సి ఉంది.

ఎమ్మెల్యే ఆరణితో కలిపి 22 మంది అధికార కూటమి సభ్యులు రాగా, తెదేపాలో చేరదలచుకున్న మరో అయిదుగురు కార్పొరేటర్లను భూమన అభినయ్ రెడ్డి ప్రభృతులు నిర్బంధించడం, తమతో తీసుకువెళ్లడంతో రాద్ధాంతం అయింది. కోరం లేక సోమవారం ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. కొత్తగా మారదలచుకున్న వారికి బ్రెయిన్ వాష్ చేసేందుకు భూమన తండ్రీ కొడుకులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
మంగళవారం జరిగిన ఓటింగులో ఎమ్మెల్యే ఆరణితో కలిపి తెలుగుదేశానికి 26 ఓట్లు వచ్చాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులున్నప్పటికీ వైసీపీకి 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో.. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయరుగా మునికృష్ణ ఎన్నికయ్యారు. వైసీపీ పరాభవభారాన్ని మూటగట్టుకుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories