సెలవు చీటీ : జగన్ ‘ఈగో’ గాయపడదా?

చాలామందికి తెలియని సంగతి ఒకటి ఇవాళ వెలుగులోకి వచ్చింది. క్లాసులో విద్యార్థులు అయినా, ఆఫీసుల్లో ఉద్యోగులు అయినా ఎలాంటి నిబంధనలు పాటిస్తూ ఉండాలో.. చట్టసభల్లో ఎమ్మెల్యేలు అయినా సరే.. వారికి కూడా అలాంటి నిబంధనలు తప్పకుండా ఉంటాయి. ఆ నిబంధనలను పట్టించుకోకపోతే.. తదనుగుణమైన పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. ఏపీ శాసనసభకు డిప్యూటీ స్పీకరు అయిన రఘురామక్రిష్ణ రాజు ఒక కొత్త సంగతిని ఢిల్లీలో బయటపెట్టారు. శాసనసభకు వరుసగా అరవై రోజుల పాటు ఒక ఎమ్మెల్యే గైర్హాజరు అయితే.. ఆయన ఆటోమేటిగ్గా ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతాడని వెల్లడించారు. అయితే 60 రోజుల వ్యవధిలోగా సహేతుక కారణాలతో సెలవు చీటీ పెడితే.. వేటు పడకుండా తప్పించుకోవచ్చునని, ఆ నిబంధనకు ఉన్న వెసులుబాటును కూడా డిప్యూటీ స్పీకరు వెల్లడించారు. ఈ నిబంధన జగన్ పదవి మీద వేటుపడడానికి వేలాడుతున్న కత్తిలాగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే.. కనీసం పదిశాతం మంది సభ్యుల బలం ఉండాలనేది రాజ్యాంగ నిబంధన, సాంప్రదాయం. ఆ దామాషా ప్రకారం కనీసం 18 సీట్లు దక్కవలసి ఉండగా.. ప్రజలు ఆయనకు కేవలం 11 సీట్ల విజయం మాత్రమే ఇచ్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలే తిరస్కరించారు. అయితే.. తనకు ఆ హోదా మరియు తద్వారా కేబినెట్ ర్యాంకు అనే వైభవం.. కూటమి ప్రభుత్వం తిరస్కరించినట్టుగా ప్రచారం చేసుకుని.. ప్రజల సానుభూతి పొందడానికి జగన్ తొలినుంచి ప్రయత్నిస్తున్నారు.
ఒకసారి ముఖ్యమంత్రిగా వైభోగం వెలగబెట్టి.. 11 మంది ఎమ్మెల్యేలతో సభకు వెళ్లడాన్ని అవమానంగా భావిస్తున్న జగన్.. ఆ ప్రతిపక్ష హోదా సాకు చూపించి.. తనకు హోదా ఇస్తే తప్ప తాను అసెంబ్లీకి వెళ్లనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ సభకు వెళ్లకుండా కట్టడిచేశారు. అయితే.. ఇప్పుడు డిప్యూటీ స్పీకరు రఘురామ చట్టంలోని నిబంధనల్ని గుర్తుచేస్తున్నారు. కనీసం సెలవుచీటీ కూడా పెట్టకుండా.. వరుసగా 60 రోజుల పాటు  హాజరు కాకపోతే.. ఎమ్మెల్యేలమీద వేటు వేయచ్చునని ఆయన అంటున్నారు. అయితే తన ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోకుండా జగన్ సెలవు చీటీ పంపడానికి సిద్ధమేనా? అలా చేస్తే ఆయనలోని ఈగో గాయపడకుండా ఉంటుందా? ఆయన తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ఎదుట సాగిలపడినట్టుగా ఉంటుంది కదా.. అనే రకరకాల సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories